CM Revanth Reddy : పేదలందరికీ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్- మరో రెండు పథకాలకు సీఎం రేవంత్ శ్రీకారం

మహిళల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.

CM Revanth Reddy : పేదలందరికీ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్- మరో రెండు పథకాలకు సీఎం రేవంత్ శ్రీకారం

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు గ్యారంటీలను ప్రారంభించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ స్కీమ్ లకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నాం అని సీఎం రేవంత్ తెలిపారు. అర్హులందరికీ ఉచిత విద్యుత్ ను అందిస్తామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు.

పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యిందన్నారు రేవంత్ రెడ్డి. చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ రెండు పథకాలను సచివాలయంలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిందే కాంగ్రెస్ అని రేవంత్ తెలిపారు. మహిళల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.

రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలు ఇవే..
1. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
2. ప్రజాపాలనలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
3. యాక్టివ్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉండాలి.

తెలంగాణలో మరో రెండు పథకాలకు రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయం వేదికగా రెండు గ్యారంటీలను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెల్ల రేషన్‌ కార్డు కలిగున్న అర్హులైన వారందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలు చేస్తామన్నారు.

మహిళల కళ్లలో ఆనందమే లక్ష్యం- సీఎం రేవంత్
”పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకే గృహజ్యోతి. ఆరు గ్యారంటీల అమలుకు సోనియా మాట ఇచ్చారు. సోనియా మాటపై విశ్వాసంతో మాకు అధికారం ప్రజలు ఇచ్చారు. ఆర్థిక వెసులబాటును అంచనా వేసుకుని ప్రభుత్వం ముందుకెళుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సిలిండర్, గృహజ్యోతి ఇస్తాం. ఈసీ నిబంధనల కారణంగా సచివాలయంలో ప్రారంభిస్తున్నాం.

గత కేసీఆర్ సర్కార్.. సిలిండర్ ధరను తగ్గించ లేదు. మహిళల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆర్థిక సంక్షోభం ఉన్నా దుబారా తగ్గించుకుంటూ.. పేదల సంక్షేమానికి క్రమపద్ధతిలో వెళ్తున్నాం. మా ప్రభుత్వం నిబద్దతతో ఉంది. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మరు. సోనియా మాట శిలాశాసనం. ఆమె మాట నిలబెడతాం. సంక్షేమ అభివృద్ధి పథంలో ప్రభుత్వం పని చేస్తుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సోనియా మాట శిలాశాసనం- సీఎం రేవంత్
”పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజాపాలన ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం.

మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నాం. హామీలు అమలు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనం” అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం జీవో జారీ, మార్గదర్శకాలు ఇవే