HCU Lands Dispute : రంగంలోకి మీనాక్షి నటరాజన్.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై మంత్రులతో చర్చించారు.

HCU Lands Dispute : రంగంలోకి మీనాక్షి నటరాజన్.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు

Updated On : April 5, 2025 / 10:15 PM IST

HCU Lands Dispute : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో దీన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు.

సచివాలయానికి వెళ్లిన మీనాక్షి నటరాజన్ భట్టి ఛాంబర్ లో మంత్రులతో సమావేశం అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల పూర్తి వివాదంపై మంత్రులతో చర్చించారు. అనంతరం హెచ్ సీయూకి చెందిన ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆందోళనలకు ఎన్ఎస్ యూఐ మద్దతు నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి తెరదించేలా దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో పాటు పార్టీ విద్యార్థి సంఘ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీ విద్యార్థి విభాగానికి గ్యాప్ లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు మీనాక్షి.

Also Read : కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేత ఎఫెక్ట్.. పొంచి ఉన్న ప్రమాదం, 4 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు..!

మంత్రుల కమిటీతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు మీనాక్షి నటరాజన్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ది పర్యావరణ పరిరక్షణ విధానమేనని స్పష్టం చేశారు. అందరితో చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు మీనాక్షి నటరాజన్.

 

కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఈ నెల 16లోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంత అత్యవసరంగా ఆ భూముల్లో పనులు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ఏం నిర్మాణాలు అక్కడ చేపట్టబోతున్నారు? దీనికి పర్యావరణ అటవీశాఖ అనుమతులు తీసుకున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు. దీనిపై సమగ్రమైన అఫిడవిట్ ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో అఫిడవిట్ కు సంబంధించి ఎలాంటి అంశాలను ప్రజెంట్ చేయాలి, ప్రభుత్వ వాదనలు ఏ విధంగా అఫిడవిట్ లో ప్రతిబింబించే విధంగా ఉండాలి అనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించారు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివి అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అయితే, ఆ భూములు యూనివర్సిటీకి చెందినవిగా ప్రతిపక్షాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఆ భూముల విషయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఆ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉన్నాయని, ఆ భూములను అభివృద్ధి పనుల కోసం వాడుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందని సీఎం రేవంత్ తేల్చి చెబుతున్నారు. ఆ భూముల్లో అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో ప్రతిపక్షాలు కావాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశాలన్నీ సమగ్రంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసే అఫిడవిట్ లో పొందుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.