Kancha Gachibowli Deforestation : కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేత ఎఫెక్ట్.. పొంచి ఉన్న ప్రమాదం, 4 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం వలన పర్యావరణానికి ఊహించని ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Kancha Gachibowli Deforestation : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చిచ్చు రాజేసింది. అంతేకాదు, ఆ అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లను కూడా నరికివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కంచ గచ్చిబౌలిలోని భూముల్లో చెట్ల నరికివేతతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లనుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఓ వార్త నగరవాసులను టెన్షన్ కు గురి చేస్తోంది. హెచ్ సీయూ భూముల్లో అటవీ నిర్మూలన ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంపై పడనుందని చెబుతున్నారు. భారీగా చెట్ల తొలగింపుతో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 1 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంచనా వేశారు.
కంచ గచ్చిబౌలి అడవిలోని ఒక ప్రధాన భాగాన్ని ఐటీ పార్క్ కోసం అధికారులు తొలగించారు. దీని వలన పర్యావరణానికి ఊహించని ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడు? ఒక రైతు కుటుంబంలో ఎంతమంది అప్లయ్ చేసుకోవచ్చు? ఫుల్ డిటెయిల్స్!
రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ ఏరియాని (కేజీఎఫ్) హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులుగా భావిస్తారు. అలాంటి చోట ఒక పెద్ద భాగాన్ని ఐటీ పార్క్ కోసం నిర్దాక్షిణ్యంగా నాశనం చేశారని పర్యావరణ పరిరక్షకులు మండిపడుతున్నారు. అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం వల్ల పర్యావరణానికి కలిగే ప్రమాదం గురించి ముందే హెచ్చరించారు. అయినా అదేమీ లెక్క చేయకుండా చెట్లను నరికివేశారని వాపోయారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, పర్యావరణ శాస్త్రవేత్త అరుణ్ వాసిరెడ్డి, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ శ్రీరామ్ రెడ్డి రూపొందించిన పర్యావరణ వారసత్వ నివేదిక ప్రకారం, కేజీఎఫ్ అటవీ నిర్మూలన వల్ల తెల్లాపూర్, నల్లగండ్ల, గచ్చిబౌలి పక్కనే ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రత 1-4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని చెప్పారు. అంతేకాదు కేజీఎఫ్ అటవీ నిర్మూలనతో స్థానికులు.. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కార్పొరేట్ సంస్థలు మరిన్ని విద్యుత్ ఛార్జీలను చెల్లించాల్సి రానుందని నివేదికలో పేర్కొన్నారు.
KGF.. 233 పక్షి జాతులు, 72 వృక్ష జాతులకు నిలయంగా ఉంది. ఇవి 40వేల కంటే ఎక్కువ చెట్లు, విభిన్న వన్యప్రాణులను ఆదుకుంటున్నాయి. 400 ఎకరాల భూముల్లో అటవీ నిర్మూలన ఆపరేషన్‌ను పర్యావరణ వినాశనంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, పర్యావరణ శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఈ అడవి మంజీరా బేసిన్‌లోని ఎత్తైన ప్రదేశంలో ఉంది. వరదలను నివారించడంలో, మంచినీటి సరస్సులను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ సంరక్షించబడిన ప్రతి నీటి చుక్క వేల హెక్టార్ల భూమిని, మొత్తం బేసిన్‌ను ప్రభావితం చేస్తుందని వివరించారు.
గచ్చిబౌలి ఎందుకు ముఖ్యమైనది?
అటవీ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో 27,292 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. ఇది రాష్ట్ర మొత్తం భౌగోళిక ప్రాంతంలో దాదాపు 24%. ఇందులో 19,696.23 చదరపు కిలోమీటర్లు రిజర్వ్డ్ ఫారెస్ట్. 6,953.47 చదరపు కిలోమీటర్లు రక్షిత అడవి. మిగిలిన 642.30 చదరపు కిలోమీటర్లు వర్గీకరించబడలేదు. కానీ 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వివిధ నీటిపారుదల, రహదారి నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో అడవులు, జీవవైవిధ్యం తగ్గిపోతోందని నివేదికలు చెబుతున్నాయి.
KGF లో కనిపించే కనీసం 27 పక్షి జాతులు వన్యప్రాణుల రక్షణ చట్టం (1972) షెడ్యూల్ కింద గుర్తించబడ్డాయి. ఇది భారతదేశంలో అత్యున్నత స్థాయి చట్టపరమైన రక్షణను అందిస్తుంది. ఇండియన్ రాక్ పైథాన్, బెంగాల్ మానిటర్ లిజార్డ్, నక్షత్ర తాబేలు, ఇండియన్ చామెలియన్, మచ్చల జింక వంటి అరుదైన జాతులకు కేజీఎఫ్ ఆశ్రయం కల్పిస్తుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) జాతుల రెడ్ లిస్ట్ కింద గుర్తించబడ్డాయి. అంటే.. అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతులను గుర్తించడానికి ప్రపంచ బెంచ్‌మార్క్ గా పరిగణిస్తారు.
Also Read : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..
2023 స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ (SoIB) నివేదిక ప్రకారం అధిక ప్రాధాన్యత కలిగినవిగా గుర్తించబడిన 46 సరీసృపాల జాతులు, 13 ఉభయచరాలు, 32 పక్షి జాతులు కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాయి. 2010లో కనుగొనబడిన ప్రత్యేకమైన సాలీడు ముర్రిసియా హైదరాబాద్‌కు ఈ అడవి మాత్రమే నిలయం. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.
కంచ గచ్చిబౌలి.. ISB, IIT, విప్రో, యాక్సెంచర్, అమెజాన్ ఆర్థిక జిల్లాను కూడా కలిగి ఉన్న కీలకమైన జోన్‌లో ఉంది. దాన్ని సంరక్షించడం హైదరాబాద్‌ను నిలబెట్టే సరస్సు, కొండ పర్యావరణ వ్యవస్థను కాపాడటానికి అత్యంత కీలకం అని పర్యావరణ వేత్తలు స్పష్టం చేశారు.