Mallu Ravi : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన విద్యార్థులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక హెచ్ సీయూ భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మల్లు రవి ఆరోపించారు.
కేటీఆర్, హరీశ్ రావు, కవితలపైనా విరుచుకుపడ్డారు మల్లు రవి. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి లేనివి ఉన్నట్టు చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడానికి కేటీఆర్, హరీశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మల్లు రవి. హైదరాబాద్ గాంధీభవన్ లో మల్లు రవి మాట్లాడారు. హెచ్ సీయూ భూముల వివాదంపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.
Also Read : కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేత ఎఫెక్ట్.. పొంచి ఉన్న ప్రమాదం, 4 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
”HCU దగ్గర ఉన్న భూమి 20 సంవత్సరాల నుండి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేయలేదు. బిల్లీ రావు అప్పటి సీఎం కేసీఆర్ తో ఒప్పందం చేసుకున్నారు. కవిత అనేకసార్లు బిల్లీ రావుని కలిసింది. ఆ భూమిలో ఏదైనా వస్తుందేమోనని కవిత ఆశ పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని కాపాడింది.
మార్ఫింగ్ ఫోటోలు పెట్టి లేనివి ఉన్నట్టు చేసి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడానికి కేటీఆర్, హరీశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై తప్పుడు అభిప్రాయం కల్పించడానికి కేటీఆర్, హరీశ్ అనేక లేఖలు రాహుల్ గాంధీకి రాశారు. ఆనాటి గ్లోబల్ అబద్దాల మంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
పెట్టుబడులు పెట్టే వారిని కేటీఆర్ భయపెడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 20వేల కోట్ల విలువ గల భూములను వేలం వేశారు. రైతు రుణమాఫీ చేయటంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం ఏకకాలంలో 21వేల కోట్ల రుణమాఫీ చేసింది. గత ప్రభుత్వం పేపర్ లీకేజీ చేసింది. ఎలాంటి లీకేజీ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసింది మా ప్రభుత్వం.
40శాతం మెస్ చార్జీలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిది. యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చాం. దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా కేటీఆర్, హరీశ్ రావు తీరు ఉంది. రాహుల్ గాంధీ సూచన మేరకే బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాం. అవసరమైతే HCU ను 4th సిటీకి తరలిస్తాం. మిగతా 1300 ఎకరాల భూమిలో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం” అని మల్లు రవి అన్నారు.