Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

ముఖ్యమైన హామీలకు వేదిక కానున్న కొల్లాపూర్‌ను సెంటిమెంట్‌గా చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు తమకు గట్టి పట్టున్న పాలమూరు జిల్లా నుంచి..

Jupally Krishna Rao

Telangana Congress Party: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి (election campaign) కాంగ్రెస్ రెడీ అవుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేరిక సభలో ఎన్నికల శంఖారావం పూరించాలని అనుకున్న కాంగ్రెస్.. అనుకోని కారణాలతో వరుసగా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో జూపల్లి చేరికను ఢిల్లీకి మార్చినా.. ఎన్నికల సమర సన్నాహాక సభ మాత్రం జూపల్లి సొంత నియోజవకర్గం కొల్లాపూర్‌ (kollapur)లోనే నిర్వహించేందుకు మంచి ముహూర్తం చూస్తోంది..

ఈ ఏడాది చివర్లో తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక గెలిచిన హస్తంపార్టీ.. అదే ఊపులో తెలంగాణలోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో అమలు చేసిన విధంగానే తెలంగాణలో వ్యూహా, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. ఎన్నికల హామీలతో పాటు ప్రచార అస్త్రాలను సిద్ధం చేస్తోంది కాంగ్రెస్.. డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగాలంటే.. అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే మరో రెండు నెలల్లో ఎన్నికల హడావుడి అధికారికంగా మొదలు కానుంది. దీంతో ప్రచారంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.

వాస్తవానికి గత నెలలోనే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లిని కాంగ్రెస్‌లో చేర్చుకుని క్షేత్రస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావించింది కాంగ్రెస్. అనుకున్నట్లే పొంగులేటి చేరిక జరిగిపోవడం.. రాహుల్‌ గాంధీ ముఖ్య అతిధిగా భారీ బహిరంగ సభ నిర్వహించింది హస్తం పార్టీ. ఆ తర్వాత జూపల్లి సొంత నియోజకవర్గం కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీతో సభ నిర్వహించి.. జూపల్లిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని భావించింది. ఐతే అనూహ్య పరిణామాలు.. వర్షాలతో ప్రియాంక సభ, జూపల్లి చేరిక తేదీలు వాయిదా పడుతూ వచ్చాయి.

Also Read: హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. పోటీగా దిల్‌రాజు రెడీ.. ఎక్కడి నుంచి పోటీ!?

ఇక ఇలా ప్రియాంక సభ కోసం ఎదురుచూస్తూ ఉంటే సమయం మించిపోతుండటంతో జూపల్లి చేరికను ఢిల్లీకి మార్చింది కాంగ్రెస్ పార్టీ. రెండో తేదీ బుధవారమే జూపల్లి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సివుండగా, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి ఖాళీ లేకపోవడం.. ఆయన రాష్ట్రపతితో భేటీ కావాల్సివుండటంతో గురువారానికి వాయిదా పడింది. కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభలో జూపల్లికు కాంగ్రెస్ కండువా కప్పాల్సివున్నా.. వరుస సంఘటనలతో జాప్యం జరుగుతుండటం వల్ల.. ఆయన క్షేత్ర స్థాయి పర్యటనలకు సమయం ఉండదనే కారణంతో ఢిల్లీలో హడావుడిగా పూర్తి చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. కానీ, కొల్లాపూర్‌లో మాత్రం సభ నిర్వహించి.. అక్కడి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించాలని నిర్ణయించింది. దీంతో ఎన్నికల ముందు ఎక్కడి నుంచి ప్రచారం ప్రారంభిస్తారనే సస్పెన్స్‌కు తెరపడింది.

Also Read: వాహనదారులకు బంపర్ ఆఫర్.. హైదరాబాద్‌లో పెట్రోల్ ఫ్రీ, మీకు కావాలంటే వెంటనే ఇలా చేయండి..

ఈ నెల రెండో వారంలో కొల్లాపూర్‌లో ప్రియాంక లేదంటే సోనియాను రప్పించి ఎన్నికల ప్రచార సభ నిర్వహించాలని అనుకుంటోంది రాష్ట్ర నాయకత్వం. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కొల్లాపూర్లో నిర్వహించే సభలోనే కాంగ్రెస్ హామీలపై ప్రకటనలు చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని కసరత్తు చేస్తోంది. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ఆరు హామీలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. మహిళా సంఘాలకు రుణమాఫీ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, మహిళలకు 5 వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలు ఇవ్వనుంది. ఇలా ముఖ్యమైన హామీలకు వేదిక కానున్న కొల్లాపూర్‌ను సెంటిమెంట్‌గా చేసుకుంటోంది కాంగ్రెస్. ఒకప్పుడు పార్టీకి గట్టి పట్టున్న పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని అనుకోవడం కూడా ఈ సెంటిమెంట్‌కు కారణంగా భావిస్తున్నారు హస్తం నేతలు.

ట్రెండింగ్ వార్తలు