TSRTCపై కరోనా కాటు. డిపోల్లో వేలాది బస్సులు, రోజుకు మూడున్నర కోట్ల లాస్

TSRTCపై కరోనా కాటు. డిపోల్లో వేలాది బస్సులు, రోజుకు మూడున్నర కోట్ల లాస్

Updated On : June 19, 2021 / 4:42 PM IST

కరోనా ప్రభావం దేశంలో అన్ని రంగాలపై  పడింది. ఆర్టీసీని అయితే తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తోన్న ఆర్టీసీ… కరోనా కాటుతో కుదేలైంది. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కేతున్న టీఎస్‌ ఆర్టీసీ…. లాక్‌డౌన్‌తో మరింతగా నష్టాలను మూటగట్టుకుంటోంది. లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియక, భవిష్యత్ ఎంటో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో పడింది.

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చే టీఎస్‌ ఆర్టీసీ బస్సులు… లాక్‌డౌన్‌ కారణంగా డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ప్రతి డిపో నుంచి కొన్ని బస్సులను మాత్రం కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కోసం స్పెషల్‌గా నడుపుతున్నారు. వారిని ఇళ్ల నుంచి ఆస్పత్రులకు తీసుకురావడంతోపాటు.. తిరిగి వాళ్లను ఇంటికి చేర్చేందుకు  సిటీ బస్సులు సేవలు అందిస్తున్నాయి.

ప్రతిరోజు 40 నుంచి 50 బస్సులను ఇందుకోసం వినియోగిస్తున్నారు. వైద్య సిబ్బందితోపాటు.. పారిశుద్ద్య సిబ్బంది కోసం కూడా నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో విజయపాలను వినియోగదారులకు చేరవేసేందుకు కూడా  సిటీ బస్సులను వినియోగిస్తున్నారు.  నగరంలోని 29 డిపోలను ఈ అత్యవసర సేవల్లో భాగస్వామ్యం చేసే విధంగా ప్రతి డిపో నుంచి బస్సులను, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం రవాణా వ్యవస్థను నిలిపివేసింది. దీంతో ఆర్టీసీ సేవలు స్తంభించాయి. లాక్‌డౌన్‌కు ముందు కార్మికుల సమ్మెతో తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీకి ఇప్పుడు కరోనా రూపంలో దెబ్బతగిలింది. లాక్‌డౌన్‌తో ప్రతిరోజు ఆర్టీసీ మూడున్నర కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలోని 97 బస్ డిపోలు, 3 బస్ బాడీ గ్యారేజ్‌లు ఉండగా 10వేల 400 బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.

సాధారణంగా ప్రతిరోజు ఆర్టీసీ సర్వీసులు 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. ఇందుకు 4కోట్ల 90 లక్షల విలువైన 7 లక్షల లీటర్ల డిజిల్ ఖర్చు అవుతుంది. నెలకు జీతాల రూపంలో 230 కోట్లు ఉద్యోగులకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ప్రతీనెలా సుమారు వంద కోట్ల రూపాయల అప్పులు, వడ్డీలు కూడా చెల్లిస్తోంది. ఇలా ఏవిధంగా చూసినా లాక్ డౌన్ వల్ల ఆర్టీసీ వందల కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. టిక్కెట్టేతర ఆదాయం కూడా నష్టపోగా..ఇప్పుడు కేవలం డీజిల్ ఖర్చు మిగులుతుంది. లాక్ డౌన్ తరువాత జనాలు బస్సుల్లో ప్రయాణించకుంటే.. ఆర్టీసీ భారీ మొత్తంలో నష్టాలను మూట కట్టుకోవాల్సి వస్తుంది.

Also Read | తెలంగాణలో మరో కలకలం : జమాతే సదస్సుకు హైదరాబాద్ రోహింగ్యాలు