నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 11:59 AM IST
నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

Updated On : July 20, 2020 / 1:56 PM IST

దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న తొలి కరోనా వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ లో(నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. సోమవారం(జూలై 20,2020) నిమ్స్ డాక్టర్లు వాలంటీర్ కు తొలి డోస్ ఇచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ డోస్ ఇచ్చిన తొలి సెంటర్‌గా నిమ్స్ నిలిచింది.

భారత్ బయోటెక్ దేశీయంగా ఈ వ్యాక్సిన్ ను రూపొందించింది. మనుషులపై ప్రయోగాలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఇద్దరు వాలంటీర్లను ఎంపిక చేసి అబ్జర్వేషన్, ఐసోలేషన్‌లో ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితి విషయమై అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. టీకా ఇచ్చే ముందు వారు వైరస్ బారిన పడకుండా చూసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌కు 20 మంది వాలంటీర్లు ఆసక్తి చూపారని నిమ్స్ అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన వాలంటీర్లకు తొలి డోసు ఇచ్చిన తర్వాత కొంత సమయంపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతారు.

ఇద్దరు వాలంటీర్లకు రెండు విధాలైన డోసులను ఇవ్వనున్నారు. ఒకరికి ప్లాసేబో డోస్ ఇస్తే.. మరొకరికి థియాక్టివ్ వ్యాక్సిన్ డోస్ ఇవ్వనున్నారు. ఏవైనా నెగటివ్ రియాక్షన్స్ వస్తాయేమో తెలుసుకోవడం కోసం 24 గంటలపాటు వీరిని అబ్జర్వేషన్ లో‌ ఉంచుతారు. తొలి దశలో ఇచ్చిన వ్యాక్సిన్ క్షేమకరమేనా కాదా అనేది పది రోజుల్లో తేలనుంది.

భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణేలోని వైరాలజీ ల్యాబ్ రూపొందించిన వ్యాక్సిన్‌‌ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్ నిమ్స్, విశాఖలోని కేజీహెచ్ సహా దేశంలోని 12 హాస్పిటళ్లలో క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. క్లినికల్ ఫార్మకాలజీ విభాగం ఉన్న హాస్పిటళ్లను మాత్రమే ఐసీఎంఆర్ ఎంపిక చేసింది.

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ప్రయోగాలు చేశారు. మనుషులపై దీన్ని ప్రయోగించేందుకు ఇటీవల ఆమోదం లభించింది. క్లినికల్‌ ట్రయల్స్‌కు దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా.. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు అవకాశం లభించింది. కొద్దిరోజులుగా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ సారథ్యంలో ప్రత్యేక బృందం వాలంటీర్లను ఎంపిక చేసింది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతాయని వైద్యుల బృందం స్పష్టం చేసింది.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్ తయారీలో దేశాలన్నీ నిమగ్నమయ్యాయి. భారత్ కూడా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. భారత్ బయోటెక్ డెవలప్ చేస్తున్న కోవ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ దశలో ఉన్న విషయం విదితమే. దేశంలోని మొత్తం 12 సెంటర్స్‌లో నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో 375 మందిపై మొదటి డోస్‌ను టెస్ట్‌ చేయనున్నారు. నిమ్స్‌లో 60 మందిపై ట్రయల్స్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.