రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోసం..సీపీఎం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. వరుసగా మూడు టర్మ్‌లుగా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు తమ్మినేని వీరభద్రం. పార్టీ నిబంధనల ప్రకారం ఆయనకు మరోసారి కార్యదర్శి అయ్యే అవకాశం లేదు. దీంతో పార్టీలో చాలామంది నేతలు రాష్ట్ర కార్యదర్శి సీటుపై కన్నేశారు. దీంతో ఈసారి సీపీఎం పార్టీ రథసారధి ఎవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎప్పుడూ లేని విధంగా జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగింది. దీంతో సీపీఎం స్టేట్ సెక్రటరీ రేసు మరింత ఉత్కంఠ రేపుతోంది.
త్వరలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో జరగనున్నాయి. రాష్ట్ర మహాసభల చివరిరోజు రాష్ట్ర కొత్త సారధిని ఎన్నుకుంటారు. ప్రతి మూడేళ్లకోసారి సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తారు. ఆ సభల ద్వారానే రాష్ట్ర కార్యదర్శిని పార్టీ ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి పార్టీ కార్యదర్శి పదవికి మూడు టర్మ్‌ల కంటే ఎక్కువ కాలం ఉండకూడదనే రూల్ సీపీఎం పార్టీ ఉంది.
గ్రామ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శి వరకు మూడుసార్లు మాత్రమే కార్యదర్శి పదవిలో ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఉన్నారు. పార్టీ నియమం ప్రకారం తమ్మినేని టర్మ్ ముగియడంతో రాష్ట్ర కార్యదర్శి ఎవరు అవుతారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
వీరి మధ్య పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యానికి గురి అయ్యారు. అప్పటి నుంచి ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్.వీరయ్య పార్టీ కార్యాలయ బాధ్యతలు చూస్తున్నారు. కొత్త కార్యదర్శి రేసులో పార్టీ సీనియర్ నేతలు ఎస్.వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన పొతినేని సుదర్శన్ పోటీ పడుతున్నారు. ఈసారి రాష్ట్ర కార్యదర్శి పదవి పై ఖమ్మం, నల్గొండ జిల్లా నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారట. పార్టీ నిర్మాణంలో తమ జిల్లా పాత్ర ఉందని పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఈసారి చాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. అయితే ఈ సారి జిల్లా కార్యదర్శుల ఎన్నిక రసవత్తరంగా సాగింది చాలా జిల్లాల్లో జిల్లా కార్యదర్శి ఎన్నిక కోసం ఓటింగ్ వరకు వెళ్లింది. మరి రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక కూడా ఏకగ్రీవ అవుతుందా.? లేక ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ ఉంటే ఓటింగ్ జరుగుతందా అనేది ఆసక్తికరంగా మారింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవి ఎవరికి దక్కబోతుందనేది చూడాలి మరి.