రైతుల ఖాతాకే రుణమాఫీ నగదు!

New Project
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణామాఫీ పథకంలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. రుణమాఫీ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రుణమాఫీ చెల్లింపులకు సంబంధించి బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. ఇక నుంచి మరో తరహాలో రైతులకు చెల్లింపులను జరపాలనే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. బ్యాంకర్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను ఆశించిన స్థాయిలో అమలు చేయడం లేదని రైతులు, రైతు సంఘాల నుంచి ఫిర్యాదులు, ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి రైతులకు రుణమాఫీ చెక్కులను వారి పేరుతోనే ఇవ్వాలని భావిస్తోంది. లేనిపక్షంలో రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాకు నగదును బదిలీ చేయడమా అనే అంశంపై అర్ధిక శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రైతు రుణమాఫీ పక్కదారి పట్టకుండా విధి విధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆర్ధికశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రూ.లక్ష పంట రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ లో ప్రకటించేందుకు సీఎం కేసీఈర్ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. గోల్కొండ కోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంలో రుణామాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. దీంతో అధికారులు చెల్లింపులపై దృష్టి సారించారు. లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించారు.
కేసీఆర్ రెండోపారి సీఎం అయ్యాక ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనూ ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలకు రూ.6 వేల కోట్లు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2018 డిసెంబర్ 11వ తేదీన రుణమాఫీ గడువు తేది ఇదో రోజున ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు ఇదివరకే ప్రకటించాయి. దాని ప్రకారం లక్ష లోపు ఉన్న మొత్తం రుణాలు రూ.32 వేల కోట్లు ఉండొచ్చని అప్పట్లో అంచనా వేశారు. గతంలో చేసిన రుణమాఫీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు.
రుణమాఫీ చెల్లింపుల విధానంలో మార్పులు చేపట్టాలని నిర్దేశించారు. బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ రుణమాఫీ విధివిధానాలను మార్చివేయాలని ఆర్థిక శాఖ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు తక్షణ ప్రయోజనం కలుగకపోగా వారిపై మోయలేని వడ్డీ భారం పడిందని సీఎం చెప్పినట్లు సమాచారం.
బ్యాంకర్లు రుణమాఫీ చెల్లింపులకు సంబంధించిన ప్రణాళికలను ఆశించిన స్థాయిలో అమలు చేయకపోవడంతో రైతులు కొత్త రుణాలు అందక చాలా ఇబ్బందులు పడ్డారని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ దఫా రైతులకు చెక్కులు ఇవ్వడమో లేక రుణమాఫీ మొత్తాలను విడతల వారిగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడమో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని విడతల్లో రుణమాఫీ చేయాలనే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే మొత్తం రుణాలను అన్ని విడతల్లో చెల్లించాలని, ఎక్కువ మొత్తం ఉన్నవాటిని మూడు లేదా నాలుగు విడతల్లో పూర్తి చేయాలని ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
ఈ ప్రతిపాదనలన్నింటినీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వంలో ఉన్న వెసులుబాటును చూసుకుని రుణమాఫీ విధి విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రుణమాఫీ విధి విధానాలపై సీఎం కేసీఆర్ నేరుగా ప్రకనట చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ పథకానికి ఓటాన్ అకౌంట్ లో కేటాయించిన రూ.6 వేల కోట్లకు అదనంగా మరిన్ని నిధులను కేటాయించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రుణమాఫీ పథకానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పంపే అవకాశమున్నట్లు సమాచారం.