Akkampalli Reservoir : బాబోయ్.. అక్కంపల్లి రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లు, తీవ్ర భయాందోళనలో ప్రజలు..ఆ నీళ్లు తాగితే ఏమవుతుందోనని టెన్షన్..

హైదరాబాద్ జంట నగరాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీరు సరఫరా చేస్తారు.

Akkampalli Reservoir : బాబోయ్.. అక్కంపల్లి రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లు, తీవ్ర భయాందోళనలో ప్రజలు..ఆ నీళ్లు తాగితే ఏమవుతుందోనని టెన్షన్..

Updated On : February 14, 2025 / 9:17 PM IST

Akkampalli Reservoir : నల్గొండ జిల్లా అక్కంపల్లి రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షం అయ్యాయి. దుండగులు చనిపోయిన కోళ్లను రిజర్వాయర్ లో పడేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో రిజర్వాయర్ లో కోళ్లు ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీరు సరఫరా చేస్తారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ, ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. రిజర్వాయర్ నీటిలో చనిపోయిన కోళ్లు ఉన్నట్లు నిర్ధారించారు.

Also Read : బర్డ్ ఫ్లూతో మాంసాహార ప్రియుల్లో వణుకు.. అసలు ఈ వ్యాధి ఏంటి? ఇప్పుడు చికెన్‌ తింటే మనుషులకు అంత ప్రమాదమా?

నీటి నుంచి కోళ్ల కళేబరాలు తొలగింపు..
నీటిలో ఉన్న కోడి కళేబరాలను తొలగించే పనిని అధికారులు మొదలుపెట్టారు. స్థానికుల సహకారంతో 80 కోడి కళేబరాలను నీటిలో నుంచి తొలగించారు. దీని గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అధికారులు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీకి పంపించి మృతికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు.

ఇది ఎవరి పని? విచారణ చేపట్టిన పోలీసులు..
చనిపోయిన కోళ్లను రిజర్వాయర్ లో ఎవరు పడేశారు అన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన కోళ్లను అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పడేసింది.. పడమటి తండా గ్రామానికి చెందిన పౌల్ట్రీ రైతు అని నల్గొండ పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన పౌల్ట్రీలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో భయాందోళనకు గురైన రైతు.. పశువైద్య సిబ్బంది మార్గదర్శకత్వంతో వాటిని నిబంధనల ప్రకారం పూడ్చివేయకుండా హడావిడిగా రిజర్వాయర్‌లో పారేశాడని పోలీసులు చెబుతున్నారు.

Also Read : బాబోయ్.. 600 కిలోల చికెన్.. మందుబాబులే టార్గెట్.. అధికారుల తనిఖీల్లో భయంకరమైన విషయాలు.. ఎక్కడో తెలుసా?

రిజర్వాయర్ లో విషపూరిత అవశేషాలు, వ్యర్థాలు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి..
నీరు కలుషితమవుతుందని తెలిసినా చనిపోయిన కోళ్లను సులభమైన మార్గంలో పారవేయాలనే ఇలా చేశాడని సమాచారం. పుట్టంగండి, అక్కంపల్లి రిజర్వాయర్లు.. నల్గొండ, హైదరాబాద్ వాసులకు తాగునీరు అందిస్తున్నాయి.

పెద్ద అడిసెర్ల పల్లి, గుడిపల్లి మండలాల్లోని గ్రామాల ప్రజలు రిజర్వాయర్లలో విషపూరిత అవశేషాలు లేదా వ్యర్థాలను వేయకుండా చూడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పశుసంవర్థక శాఖ అధికారులను రంగంలోకి దిగారు. పౌల్ట్రీ యజమానులు వ్యర్థాలను, చనిపోయిన కోళ్లను ఏ విధంగా తొలగిస్తున్నారో ఆరా తీసే పనిలో పడ్డారు.