తెలంగాణలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్లాబ్ బుకింగ్స్ నిలిపివేత

non-agricultural land registration slab bookings : హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్పాట్ బుకింగ్ నిలిచిపోయింది. ఇప్పటివరకూ స్లాట్ బుక్ అయిన వారికి మాత్రమే రిజిస్టేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆప్షన్ తొలగించడమే లేక కొనసాగించడమా అన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పుపై ఏం చేయాలనేదానిపై అధికారులతో చర్చిస్తారు.
ధరణి పోర్టల్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై సాంకేతిక నిపుణలతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇక ఇదే అంశంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి అందింది. హైకోర్టు ఆదేశాలపై కూలంకుషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా? లేక న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో కేసీఆర్ చర్చిస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.