Car Symbols : టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ బుద్ధభవన్ ల్ ఎన్నికల కమిషన్ ను కలిశారు. కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తం 8 గుర్తులను మార్చాలని కోరారు. అటు బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పై క్షుద్ర పూజల ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు టీఆర్ఎస్ నేతలు.
గతంలో కారును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించడం వల్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని, మునుగోడు ఉపఎన్నికల్లో అలాంటి గుర్తులు కేటాయించొద్దని ఎన్నికల కమిషన్ ను కోరామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.
”8 గుర్తులు మా పార్టీ గురైన కారుకి అతి దగ్గరలో ఉన్నాయి. గతంలోనూ అలాంటి గుర్తులు కేటాయించడం వల్ల మా పార్టీ అభ్యర్థులు కొంతమంది అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. మా పార్టీ అభ్యర్థన మేరకు ఆ సింబల్ ను కూడా ఫ్రీజ్ చేయాలని, ఎవరికీ అలాట్ చేయొద్దని ఈసీని కోరడం జరిగింది” అని వినయ్ భాస్కర్ చెప్పారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. క్షుద్రపూజలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు టీఆర్ఎస్ నేతలు.
”గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తప్పుడు ఆరోపణలు చేశారు. ఇది బండి సంజయ్ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ఇటువంటి మాటలు మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాథ్.. ఒక మహిళా ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని వారి పై ఎన్నికల కమిషన్ నాడు చర్యలు తీసుకుంది. ఆ రకమైన చరిత్ర ఇవాళ ఎన్నికల కమిషన్ ముందున్నది. కాబట్టి అటువంటి చర్యలను తెలంగాణలో బండి సంజయ్ మీద తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశాం” అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు.