×
Ad

Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.

Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4న సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని సీఎం రేవంత్ కోరుకున్నారు.

మాజీ మంత్రి మృతికి మంత్రి పొంగులేటి సంతాపం తెలిపారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు దామోదర్ రెడ్డి అని కితాబిచ్చారు. ఐటీ శాఖ మంత్రిగా దూరదృష్టితో పని చేసి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌లో ఆ రంగ అభివృద్ధికి బలమైన పునాది వేశారని ప్రశంసించారు. యువతకు అవకాశాలు కల్పించడంలో దామోదర్ రెడ్డి పాత్ర స్ఫూర్తిదాయకమన్నారు. ధైర్యం, రాజకీయ దూరదృష్టి, నిస్వార్థ సేవలు ఆయన రాజకీయ జీవనంలో ప్రధాన లక్షణాలు అని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజలతో కలిసిమెలిసి జీవిస్తూ వారి కోసమే పని చేయడం ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేకత అన్నారు. దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం కాంగ్రెస్‌కే కాకుండా తెలంగాణ రాజకీయాలకు కూడా తీరని లోటన్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం, ప్రజాసేవ పంథా భవిష్యత్ తరాలకు మార్గదర్శకమన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు మంత్రి పొంగులేటి.