KTR
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అడిగిందే అడగటం.. తిప్పి తిప్పి అడగటం తప్ప విచారణలో ఏమీ లేదని చెప్పారు. నేనే ఎదురు ప్రశ్నలు వేశాను.. నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్ళు నమిలారు అని తెలిపారు. లీకులతో వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడుతున్నారని సిట్ అధికారులను ప్రశ్నించాను అని కేటీఆర్ అన్నారు. ఇందుకు బాధ్యత తీసుకుంటారా అని అధికారులను అడిగాను అని చెప్పారు.
”నేను అధికారులను బెదిరించినట్లు బయట ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమా? అని అడిగాను. నేను బెదిరించలేదని అధికారులు చెప్పారు. నన్ను వేరే ఎవరితోనూ కలసి కూర్చోబెట్టి విచారణ చేయలేదు. నన్ను ఒక్కడినే సిట్ అధికారులు విచారించారు. మాతో పాటు.. మంత్రులు ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని నేడు తేలిపోయింది. భయపడే వాళ్ళమైతే సిట్ విచారణకు పోతామా? కోర్టుకు పోతాం కదా?
నేను బెదిరించినట్లు కాంగ్రెస్ వాళ్ళకు ఎవరు చెప్పారు? విచారణ సందర్భంగా ఆరుగురం మాత్రమే ఉన్నాం. లీకులిచ్చి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. హీరోయిన్లతో నాకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ లీకు ఎవరిచ్చారని అధికారులను అడిగాను. ఇందులో వాస్తవం లేదని అధికారులే చెప్పారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మాకూ కుటుంబాలున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ లీకుల మీద నడుస్తోన్న ప్రభుత్వం.
రేవంత్ క్యాబినెట్ లో మంత్రే స్వయంగా తన ఫోన్ ట్యాప్ అవుతుందన్నారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వాటాల పంచాయితీ డైవర్షన్ కోసమే సిట్ విచారణ. సీఎం సన్నిహితుల దందాలు, రెవెన్యూ మంత్రి కొడుకు భూదందాలపై సిట్ ఎందుకు లేదు?” అని నిలదీశారు కేటీఆర్.
Also Read: మంత్రులకు మున్సిపోల్స్ టెన్షన్..! వారిని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి?