‘ఎంతకు తెగించారు’.. ఓటర్లకు దొంగ బంగారం.. నకిలీ వెండి పంపిణీ.. ఎక్కడంటే..
మేడ్చల్, అలియాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డులో నకిలీ వెండి కాయిన్స్ కలకలం రేపాయి.
- సిరిసిల్లలో ఓటర్లకు నకిలీ బంగారం పంపిణీ
- మేడ్చల్, అలియాబాద్లో నకిలీ వెండి కాయిన్స్
- మోసం చేశారంటూ ఓటర్లు ఆగ్రహం
Telangana municipal elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో విచిత్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు చివరి నిమిషం పాటు ప్రయత్నాలు జరిపారు.
సిరిసిల్లలో ఓటర్లకు నకిలీ బంగారం పంపిణీ చేశారు. 25వ వార్డులో నకిలీ బంగారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్వతంత్ర అభ్యర్థి వడ్నాల శ్రీనివాస్ ప్రయత్నించారు.
ఒక్కో ఓటరుకు మూడు గురజల బంగారం చొప్పున ఇస్తున్నానంటూ రాగిని పంపిణీ చేశారు. తమను మోసం చేశారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడ్చల్, అలియాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డులో నకిలీ వెండి కాయిన్స్ కలకలం రేపాయి. వెండి కాయిన్స్ అంటూ వాటిని ఓటర్లకు పంపిణీ చేశారు బీజేపీ అభ్యర్థి. నకిలీ కాయిన్స్ అని తేలడంతో అభ్యర్థిపై ఓటర్లు మండిపడ్డారు.
మరోవైపు, నిన్న జగిత్యాల జిల్లా కోరుట్లలోని 24వ వార్డులో ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎల్దీ శ్రీనివాస్ ఇంట్లో 500కు పైగా వెంకటేశ్వర స్వామి వెండి ప్రతిమలు, 15 ఏసు క్రీస్తు వెండి ప్రతిమలు, పలు స్వీట్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల పట్టణంలోని గడి బురుజు సమీపంలో వాహనాల తనిఖీలు చేయగా ఒక వ్యక్తి దగ్గర రూ.60,000 నగదు దొరికింది.
