Smokers: పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!

Smokers
Smokers: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. అంతే కాదు సమాజానికి కూడా హానికరమే.. పొగ తాగే వారికంటే వారి పక్కన ఉండి పీల్చే వారికీ ఎక్కువ ప్రమాదం ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇక ఇది ఇలా ఉంటే.. పొగరాయుళ్లు వల్ల అగ్నిప్రమాదాలు కూడా అధికంగా జరుగుతున్నాయట. కొందరి నిర్లక్ష్యం అగ్నిప్రమాదాలకు కారణమవుతుంది. కొన్ని ప్రాణాలు గాల్లోకలిసిపోతున్నాయి, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది.
2019,2020 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 8,855 అగ్నిప్రమాదాలు సంభవించాయి. పొగరాయుళ్లు సిగరెట్, బీడీ తాగి ఆ తర్వాత నిర్లక్యంగా నిప్పు ఆర్పకుండా పడేయడం వలన ఈ ప్రమాదాలకు కారణమని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ వెల్లడించింది. తెలంగాణలో బుధవారం అగ్నిమాపకశాఖ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరిగిన అగ్నిప్రమాదాల గురించి అగ్నిమాపక శాఖా అధికారులు తెలిపారు.
రెండేళ్లలో 16,859 ఫైర్ కాల్స్ వచ్చాయని వాటిలో తీవ్రమైన అగ్నిప్రమాదాలు 207 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. స్వల్ప అగ్నిప్రమాదాలు 15,345 మీడియం ప్రమాదాలు 433, రెస్క్యూకాల్స్ 874 వరకు ఉన్నట్టు వెల్లడించారు. ఇక అగ్నిప్రమాదాలతో రెండేళ్లలో 174 మంది మృతి చెందినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వలన అనేక అగ్నిప్రమాదాలను నివారించమని తెలిపారు. భారీ ప్రమాదాలను కూడా ఆస్తి నష్టం ఎక్కువగా జరగకుండా కంట్రోల్ చేయగలిగామని తెలిపారు.
2019లో రూ.770.468 కోట్లు, 2020లో రూ.959.85 కోట్ల మేర ఆస్తినష్టాన్ని నివారించినట్టు వివరించారు. ఇక ఎలెక్ట్రికల్ పరికరాల కారణంగా రెండేళ్లలో 4,718 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. పలు చోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో కూడా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయని.. నిర్లక్ష్యం కారణంగా కొందరు రైతులు నష్టపోయారని తెలిపారు.