పాతబస్తీలో వరద బీభత్సం : కాలనీ వాసుల కన్నీళ్లు

  • Published By: madhu ,Published On : October 19, 2020 / 07:20 AM IST
పాతబస్తీలో వరద బీభత్సం : కాలనీ వాసుల కన్నీళ్లు

Updated On : October 19, 2020 / 8:15 AM IST

Flood in the Hyderabad Old City : భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అయింది. వరద ఉధృతి నుంచి కోలుకునేలోపే వరణుడు మరోసారి విరుచుకుపడడంతో ప్రజల వరద కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పాతబస్తీ ప్రజలైతే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రాయణగుట్టలోని బాబానగర్‌ ప్రాంత వాసులైతే సర్వస్వం కోల్పోయారు. గుర్రం చెరువుకు గండిపడడంతో.. దాదాపు పాతబస్తీలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.



ఇళ్లల్లో నిద్రిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా వరదనీరు రావడంతో… ఏం జరిగిందోననని తెలుసుకునేలోపే ఇళ్లన్నీ జలదిగ్బంధంలోకి వెళ్లాయి. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులను ఇళ్లపైకి ఎక్కించారు. మరికొందరు ఆ నీటిలోనే ఎత్తయిన ఇళ్లకు చేరుకున్నారు. ఇక వాహనాలైతే చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయాయి.



టోలీచౌకీలోని నదీంకాలనీ పూర్తిగా నీట మునిగింది. వారం రోజులుగా నదీం కాలనీ నీళ్లలోనే ఉంది. దీంతో స్థానికులు కాలుబయట పెట్టడం లేదు. ఇళ్లన్నీ నీళ్లలోనే ఉండడంతో స్థానికులు అన్నపానీయాలకు ఇబ్బందిపడుతున్నారు. నదీం కాలనీతో పాటు పాటు విరాహత్ నగర్, నీరజ్ కాలనీ, బాలరెడ్డి నగర్ కాలనీల్లో వరద నీరు చేరింది. అపార్టమెంట్ లోని మొదటి అంతస్తు వరకూ నీరు చేరడంతో అక్కడి వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానిక యువకులు కాలనీల్లో ఉన్న వారికి నిత్యావసర సరకులు అందిస్తున్నారు.



పాతబస్తీ జల్‌పల్లి మున్సిపాలిటీలోని బుర్హాన్ పూర్ చెరువు నిండటంతో వెనుక ఉన్న ఉస్మాన్ నగర్, షాహీన్ నగర్ ప్రాంతం మంపునకు గురయ్యాయి. గత పది రోజుల నుంచి పరిస్థితి అలాగే ఉందని స్థానికులు చెబుతున్నారు. పల్లె చెరువు నుంచి వచ్చే వరద నీటితో ఫలక్ నుమా వంతెన దెబ్బతింది. వంతెనపై పెద్ద గొయ్యి పడింది. భారీ వరదతో అల్జుబల్ కాలనీ, జీఎం కాలనీ,



ఆషామాబాద్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో స్థానికులకు కొందరు యువకులు భోజనాలు వండి బోట్లలో కాలనీ వాసుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. ఫలక్‌నుమాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ అంజనీకుమార్ పర్యటించారు. నీటిని తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలు, వరదబాధితాలకు అందుతున్న సాయంపై ఆరాతీశారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మొత్తానికి భాగ్యనగరంలో కురుస్తున్న వర్షాలతో పాతబస్తీ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముండడంతో… భయంతో అల్లాడుతున్నారు.