TSRTC MD VC Sajjanar
Vijayawada Highway – Sajjanar: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మున్నేరు వాగు (Munneru Vaagu) ఉప్పొంగడంతో ఎన్టీఆర్ జిల్లా ఐతవరం (Ithavaram) దగ్గర హైవేపై వరదనీరు చేరింది. దీంతో అధికారులు పరిసరాల్లోని గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఏపీలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు NH45పై రాత్రి నుంచి విజయవాడ – హైదరాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోగా.. ఇరువైపులా కిలో మీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను తరలిస్తున్నారు. నాల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. జాతీయ రహదారి 65 నుండి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా ఏపీకి వెళ్లేలా వాహనాల మళ్లీంపు చేపట్టారు. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణీకులకు కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసిందని తెలిపారు. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోందని చెప్పారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వీసీ సజ్జనార్ కోరారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.