Harish Rao
Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యం కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్ధివదేహాన్ని ఉంచారు. హరీశ్ రావుకు పితృవియోగంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని.. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా.. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తన బావ (కేసీఆర్ 7వ సోదరి భర్త), మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావు కు ఫోన్‌చేసి కేసీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరికాసేపట్లో హరీశ్ రావు నివాసానికి వెళ్లి దివంగత సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించి, తన సోదరిని, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చనున్నారు.