Gachibowli Building Collapse : గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో కీలక పరిణామం.. బిల్డర్ అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి
Gachibowli Building Collapse : హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతం అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Gachibowli Building Collapse
Gachibowli Building Collapse : హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతం అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బిల్డర్ సాజిద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ రాయదుర్గం పోలీసులు సాజిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. భవన నిర్మాణం అనుమతులపై అతన్ని విచారించనున్నారు. సాజిద్ ఖాన్ నిర్మించిన పలు భవనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. చిన్న స్థలాల్లో అనుమతులకు మించి అంతస్తులు నిర్మించి వాటిని హాస్టళ్లుగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భవనం కూలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులు ఉమేశ్ కారే , మోపత్‌గా గుర్తించారు. ఈ ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోశ్ కుమార్‌ను కార్పొరేషన్ కమిషనర్ సృజన సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. అయితే, విచారణ పూర్తయ్యే వరకు హెడ్‌క్వార్టర్స్ వీడొద్దని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలాఉంటే.. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతుందని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే భవన యాజమానికి మూడు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఆ నోటీసులను భవన నిర్మాణదారుడు బేఖారత్ చేశారని తెలుస్తోంది. గత నెలలో బిల్డర్ కు ఫైనల్ నోటీసు ఇచ్చినా నిర్మాణం కొనసాగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ భవన నిర్మాణ సమయంలో సరైన సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం కూడా భవనం కూలడానికి కారణాల్లో ఒకటని అధికారులు పేర్కొంటున్నారు.
మరోవైపు బిల్డింగ్ కూలిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపునకు ఆటంకం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఆదివారం ఉదయం వర్షం లేకపోవడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్నారు.
