Autos Strike : ప్రయాణికులకు బిగ్‌అలెర్ట్.. అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్.. కారణమిదే..
Telangana Auto Strike : ప్రయాణికులకు బిగ్ అలర్ట్. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల సేవలు నివరధికంగా బంద్ కానున్నాయి.
Auto-Strike
Telangana Auto Strike : ప్రయాణికులకు బిగ్ అలర్ట్. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల సేవలు నివరధికంగా బంద్ కానున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.
Also Read : Toxic Pre Release Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో అపశృతి.. విద్యార్థులకు గాయాలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికులకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం (ఎరియర్స్ సహా) అందిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం అందించిన రూ.5లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించాలని, పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను సవరించాలని, అక్రమంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించి, ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్ల ఉపాధి పూర్తిగా దెబ్బతిందని, ప్రభుత్వ విధానాల వల్ల గత రెండున్నరేళ్ల కాలంలో వందల మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డారని జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. ఈ బంద్ కు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (బీపీటీఎంఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
