టీడీపీలో చక్రం తిప్పిన గరికపాటికి ఏమైంది? నమ్మిన బీజేపీ ఆ పదవి ఇస్తుందా?

టీడీపీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్ రావు.. ఇప్పుడు అంతా తారుమారైంది. సభ ఏదైనా, కార్యక్రమం ఏమైనా ప్లానింగ్‌కు పెట్టింది పేరు ఆయన. జనాలను తరలించడంలో, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటుచేయడంలో ఆయన స్టైలే సపరేట్. చంద్రబాబు వద్ద నమ్మిన భంటుగా పని చేశారు. అందుకు ప్రతిఫలంగా రాజ్యసభ పదవిని పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారం కోల్పోవడం, జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గరికపాటి బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరేటప్పుడు గరికపాటి మోహన్‌రావు ఆషామాషీగా చేరలేదు. అందరిలా ఢిల్లీ వెళ్లి కండువా కప్పుకోలేదు. అనుచరులు, బలం, బలగంతో హైదరాబాద్‌లో భారీ స్థాయి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, టీడీపీకి చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, దాదాపు 10 వేల మందితో నాంపల్లి సభ వేదికగా నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరే సందర్భంలో ఆయనకు బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందట.
మరోసారి రాజ్యసభ సభకు పంపిస్తామని చెప్పడంతో పార్టీ మారారని అంటారు. కానీ, ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసి 3 నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ ఆయనకు ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదంటున్నారు. టీడీపీలో చక్రం తిప్పిన గరికపాటి.. ఇప్పుడు బీజేపీలో మాత్రం అంత జోరు చూపించలేకపోతున్నారట. ఢిల్లీ స్థాయిలో భారీ లాబీయింగ్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ మరోసారి ఆయన రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారట.
రాజ్యసభ కాకపోయినా అదే స్థాయిలో జాతీయ స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోసారి రాజ్యసభ సభ్యుడు కావొచ్చని గంపెడు ఆశలతో బీజేపీలో చేరిన గరికపాటికి రాజ్యసభ రెన్యువల్ కాలేదు… మరి ఆ స్థాయి పదవి వస్తుందో లేదో చూడాల్సిందే అంటున్నారు అనుచరులు.