GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో డిష్యూం డిష్యూం.. చర్చ లేకుండానే బడ్జెట్ కు ఆమోదం

జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన సమయం నుంచి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు.

GHMC Council meeting

GHMC Council Meeting: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం సమావేశం ప్రారంభం కాగానే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాకు కౌన్సిల్ నివాళులు అర్పించింది. అనంతరం మేయర్ గద్వాల విజయలక్ష్మీ బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పగా.. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పారు. ముందుగా ప్రజా సమస్యలపై మాట్లాడాలంటూ పట్టుబట్టారు. అయితే, మేయర్ గద్వాల విజయలక్ష్మీ రూ.8,440 కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై మాట్లాడాలని సభ్యులను కోరగా.. ప్రజా సమస్యలపై చర్చజరపాలని విపక్ష కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియంను బీఆర్ఎస్ కార్పొరేటర్లు చుట్టుముట్టడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

 

పోడియం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. ఆరు గ్యారెంటీల అమలుపై చర్చజరపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్రతిగా బడ్జెట్ పై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను ఐదు నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. సమావేశం తిరిగి ప్రారంభమైనప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు తమ నిరసను వ్యక్తం చేశారు. కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ మేయర్ పోడియాన్ని చుట్టుమట్టారు. వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకొని ప్లకార్డులను చించివేశారు. దీంతో రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సమావేశంలో గందరగోళం మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8,440 కోట్ల బడ్జెట్ ను చర్చలేకుండా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్లకార్డులతో మేయర్ పోడియం ముందు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించారు. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

 

అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు బిక్షాటన చేసుకుంటూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వెనక ప్రాంతంలోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.