CM Revanth Reddy
కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోలేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు.
కాగా, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియ చాలా రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దరఖాస్తులను పరిశీలిస్తూనే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
దరఖాస్తుల కోసం మీ సేవా కేంద్రాల వద్ద జనాలు గుమికూడుతున్నారు. ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ చాలా మంది మీ సేవలో మళ్లీ దరఖాస్తులు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం విదితమే. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. మరోవైపు, మెదక్ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంగనర్‌లోనూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జరగనుంది.
ఈ కారణంతో తెలంగాణ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిస్తే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీంతో అలాకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోలేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.