Adilabad BJP Leaders: అధికారం వాళ్లది.. హల్చల్ వీళ్లది..! ఆ ఇద్దరు బీజేపీ నేతల తీరుతో రగిలిపోతున్న కాంగ్రెస్ నాయకులు..
ఈ బీజేపీ నేతల హడావుడి చూస్తుంటే..అసలు కాంగ్రెస్ లీడర్లం తామా? లేక వాళ్లా? అనే డౌట్ వచ్చేస్తోందట. ప్రతిపక్షంలో ఉండాల్సిన నేతలు తమ అధికార పార్టీ నేతలతో కలిసిపోయి తిరుగుతుంటే ఇక తమ రాజకీయ భవిష్యత్ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట.
- అధికార పార్టీ ఎమ్మెల్యేను మించి హడావుడి
- రిసీవింగ్ నుంచి సెండాఫ్ వరకు వాళ్లదే హల్చల్
- ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై చర్చ
Adilabad BJP Leaders: అధికారం కాంగ్రెస్‌ది. ఆ జిల్లాలో హస్తం పార్టీకి ఉన్నది ఒక్కడే ఎమ్మెల్యే. ఇంకేముంది ఇదే సందు అని..అంతకుమించి హల్చల్ చేస్తున్నారట కమలం లీడర్లు. సీఎం, మంత్రులు జిల్లాకు వస్తే చాలు ఆ బీజేపీ ఎంపీ, మరో కమలం పార్టీ ఎమ్మెల్యే అయితే చెట్ట పట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఆ జిల్లాలో అధికార పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎక్కడా తెరమీద కనిపించనంతగా హడావుడి చేస్తున్నారట. పైగా అధికార పార్టీ నేతలకు మించి..సీఎం, మంత్రులను పొగిడేస్తూ..హస్తం నేతల టూర్లలో కమలం లీడర్ల జోరు అంటూ చర్చకు దారితీస్తున్నారట. ఇంతకు ఏ జిల్లాలో ఈ పరిస్థితి? ఎవరా బీజేపీ నేతలు?
ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ప్రజాప్రతినిధుల తీరు..అధికార కాంగ్రెస్‌లో చర్చకు దారితీస్తోంది. గత ఏడాది కాలంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం సహా మంత్రులు ఎవరూ వచ్చినా..కాంగ్రెస్ నేతల కంటే..బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తెగ హడావుడి చేసేస్తున్నారట. స్వాగతం పలకడం మొదలు ఆ నేతల కాన్వాయ్‌లోనే తిరుగుతూ..పర్యటన ముగిసి సాగనంపే వరకు అనీ తామై వ్యవహరిస్తున్నారట. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుతో జిల్లా కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారట.
కక్కలేక మింగలేక అన్నట్లుగా కాంగ్రెస్ నేతల పరిస్థితి..
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో పాటు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జులు, మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట. కనీసం తమ అగ్ర నాయకులకు శాలువా కప్పి.. బొకే ఇచ్చి సన్మానం చేద్దామని అనుకున్నా..స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ముందు వరుసలో ఉండటం, వారి తర్వాతే జిల్లా హస్తం నేతలకు అవకాశం రావడం నిరాశకు గురి చేస్తోందట. అంతేకాదు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇస్తుండటంతో కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తికి లోనవుతుందట.
మంత్రితో కలిసి హెలికాప్టర్ లో చక్కర్లు..
ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనల సందర్భంగా..సీఎం రేవంత్..బీజేపీ, ఎంపీ ఎమ్మెల్యేను ఆకాశానికి ఎత్తడంతో..వాళ్లిద్దరిపై పోటీచేసి ఓడిన హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సహా ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ప్రభుత్వ పెద్దలతో హెలికాప్టర్లలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే చక్కర్లు కొట్టడం జనాలలో పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరగా..ఆయనతో పాటు పట్టుబట్టి హెలికాప్టర్ ఎక్కారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మంత్రి వద్దని వారించినా పాయల్ శంకర్ హెలికాప్టర్ ఎక్కి చక్కర్లు కొట్టడం చర్చనీయాంశం అయింది.
రాజకీయ భవిష్యత్ పై కాంగ్రెస్ లీడర్ల ఆందోళన..
ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవహారశైలి కాంగ్రెస్ నేతలను మించిపోతుందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఈ బీజేపీ నేతల హడావుడి చూస్తుంటే..అసలు కాంగ్రెస్ లీడర్లం తామా? లేక వాళ్లా? అనే డౌట్ వచ్చేస్తోందట. ప్రతిపక్షంలో ఉండాల్సిన నేతలు తమ అధికార పార్టీ నేతలతో కలిసిపోయి తిరుగుతుంటే ఇక తమ రాజకీయ భవిష్యత్ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట.
ఆదిలాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు ఉంటే..అందులో నాలుగు ఎమ్మెల్యే సీట్లను, ఓ ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. మిగిలిన ఒక సీటును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జిల్లాలో బీజేపీ అంత బలంగా ఉండి..పార్టీ బలోపేతం ప్రయత్నించాల్సిన నేతలు..సీఎం, మంత్రుల పర్యటనల్లో అత్యుత్సాహం చూపించడం కమలం క్యాడర్‌కు కూడా నచ్చట్లేదట. ఇదే జిల్లాకు చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఏకంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి వార్తల్లోకి ఎక్కారు. ఇలా నేతలంతా సొంత ఎజెండాతో పని చేస్తున్నారని..కాంగ్రెస్ జెండా మోస్తున్నారని కార్యకర్తలు రగిలిపోతున్నారట.
అటు కాంగ్రెస్ నేతల పరిస్థితి అయితే పవర్లో ఉన్నామో ప్రతిపక్షంలో తెలియని పరిస్థితి అంటున్నారు. తమ పార్టీ సీఎం, మంత్రులు..విపక్ష ఎంపీ-ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైమ్ కూడా తమకు ఇవ్వట్లేదని మదనపడుతున్నారట. బీజేపీ నేతలే కాంగ్రెస్‌కు దగ్గర కావాలనుకుంటున్నారో..లేకపోతే కాంగ్రెస్ పెద్దలే కమలం లీడర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారనేది ఎన్నికల టైమ్ వస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదంటున్నారు కాంగ్రెస్, బీజేపీ క్యాడర్.
Also Read: కారు పార్టీలో కొత్త జోష్..! బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తెచ్చేది కాళేశ్వరమేనా?
