BRS Mlas Defection Case: ఎట్టకేలకు 5 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నారు. మరి మిగతా 5 మంది సంగతేంటీ? మిగిలిని ఐదు మందిలో ఎవరిపై వేటు పడుతుంది? ఎవరు సేఫ్? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం. అవును.. 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపుల పిటీషన్లపై తీర్పు చెప్పిన స్పీకర్ మరో ఐదు మంది విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మిగతా 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై నిర్ణయానికి స్పీకర్ సుప్రీంకోర్టును మరింత గడువు కోరనున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే దానం నాగేందర్, కడియంపై వేటు తప్పదన్న ప్రచారం నేపధ్యంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేల పిటీషన్లను స్పీకర్ ఎందుకు పెండింగ్ లో పెట్టారన్నదే ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా.. ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తారా అనే ఉత్కంఠకు కొంతవరకు తెరపడింది. ఈ కేసులో అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై.. ఐదు మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై.. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని.. ప్రతీ నెలా బీఆర్ఎస్‌ఎల్పీకి చందాలు చెల్లిస్తున్నామన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల సాక్ష్యాలను స్పీకర్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. సీఎం రేవంత్‌ను కలిశామన్న ఆ ఐదు మంది ఎమ్మెల్యేల వాదనలతో ఏకీభవించిన స్పీకర్.. బీఆర్ఎస్ పిటిషన్‌లను కొట్టేశారు.
ఫిరాయింపుల కేసులో.. అక్టోబర్ 30లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ముందుగా ఆదేశించింది. ఐతే మరింత గడువు కావాలని కోరడంతో.. 4 వారాల సమయం ఇచ్చింది. అంటే నవంబర్ 17న ఫిరాయింపుల కేసుపై విచారించిన కోర్టు.. నాలుగు వారాల టైమ్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా.. 8మంది నోటీసులకు రిప్లయ్ ఇచ్చారు. విచారణకు హాజరయ్యారు. నవంబర్ 20 వరకు.. 8మంది ఎమ్మెల్యేల విచారణ జరిగింది. దీంతో 5మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇస్తూ స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగతా వారి విషయంలో విచారణ కోసం సుప్రీంకోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
మిగిలిన 5మంది వ్యవహారంపై మరింత లోతుగా విచారణ..
సుప్రీంకోర్డు గడువు ముగుస్తుండడంతో.. 5మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఐతే మిగిలిన 5మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై.. మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని.. దీనికోసం మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కోరనున్నారనే అభిప్రాయాలు వినిపిస్తన్నాయ్. ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేల్లో.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్‌పై.. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందులో పోచారం, కాలె యాదయ్య, సంజయ్ కుమార్.. విచారణకు హాజరవగా.. దానం నాగేందర్, కడియం శ్రీహరి నోటీసులకు కనీసం రిప్లయ్ కూడా ఇవ్వలేదు. పైగా మరింత సమయం కావాలని స్పీకర్‌ను కోరారు.
ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ అవగా.. మిగిలిన ఐదు మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. పార్టీ ఫిరాయించడమే కాదు.. ఏకంగా కాంగ్రెస్ సింబల్‌పై ఎంపీగా పోటీ చేశారు. ఇక తన కూతురు కావ్య ఎంపీగా పోటీ చేయడంతో.. ఆమె తరఫున కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఈ ఇద్దరిపై అనర్హత వేటు తప్పదన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. ఐతే స్పీకర్.. కేవలం ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబందించిన అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు. దీంతో తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. అసలు మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై ఎందుకు నిర్ణయం వెలువరించలేదన్న చర్చ జరుగుతోంది. దానం, కడియం పిటిషన్లను మాత్రమే పెండింగ్‌లో పెడితే.. న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిన స్పీకర్.. వారిద్దరికి తోడు మిగతా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటీషన్లను కూడా పెండింగ్‌లో పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పుడు స్పీకర్ మరింత సమయం కోరితే.. సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందనేది రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Also Read: తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు.. మోదీ మీటింగ్ వివరాలు బయటకు ఎలా? ఆ లీకు వీరులు ఎవరు?