Telangana BJP: తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు.. మోదీ మీటింగ్ వివరాలు బయటకు ఎలా? ఆ లీకు వీరులు ఎవరు?

ప్రధానితో సమావేశం అయిన వారిలో.. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఎంపీలు కూడా ఉన్నారు. ఇందులో సమావేశ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

Telangana BJP: తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు.. మోదీ మీటింగ్ వివరాలు బయటకు ఎలా? ఆ లీకు వీరులు ఎవరు?

Updated On : December 17, 2025 / 8:13 PM IST

Telangana BJP: ప్రధాని మోదీతో జరిగిన సమావేశం వివరాలు లీక్ కావడం.. తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు క్రియేట్‌ చేస్తోంది. ఎలాంటి విషయం బయటకు రావొద్దని మోదీ స్వయంగా చెప్పినా.. లీకులు జరగడం.. పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. లీకు చేసిన వాళ్లు మెంటల్‌గాళ్లు అని కిషన్‌ రెడ్డి సీరియస్‌ కావడం.. పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో సమావేశం వివరాలు బయటకు ఎలా వచ్చాయనే దానిపై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయ్‌. ఇంతకీ లీక్ చేసింది ఎవరు.. రాష్ట్ర బీజేపీ ఎంపీలేనా.. లేదంటే ఇతర నేతలెవరైనా ఉన్నారా.. కిషన్ రెడ్డి అంటున్న మెంటల్‌గాళ్లు ఎవరు..

ఈ మధ్య దక్షిణాది రాష్ట్రాలు ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌లో ఎంపీలతో కీలక అంశాలు పంచుకున్న మోదీ.. దక్షిణాదిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలంగా ఉందని చెప్తూనే.. మరింత కష్టపడి పనిచేయాలని తెలంగాణ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరిగింది. మీటింగ్‌ విషయాలు ఒక్కటి కూడా బయటకు వెళ్లకూడదని మోదీ హెచ్చరించినట్లు కూడా గుసగుసలు వినిపించాయ్. ఐతే మీటింగ్‌లో ఏం జరిగింది.. మోదీ ఎవరితో ఏం మాట్లాడారు.. ఎవరికి ఎలాంటి సూచనలు చేశారు.. ఇలా ప్రతీ విషయం బయటకు వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. అసలు ఎలా బయటకు వచ్చింది.. బయటపెట్టింది ఎవరు అనే చర్చ కమలం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఒవైసీ కంటే కూడా వెనకే ఉన్నారంటూ ప్రధాని చురకలు..

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసిన మోదీ.. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ప్రతిపక్షపాత్ర పోషించడంలో విఫలం అవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనాలకు వివరించడంతో పాటు.. కేంద్ర పథకాలను చేరవేయడంలో విఫలం అవుతున్నారని మోదీ ఫైర్ అయ్యారట. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండడం లేదని.. ఒవైసీ కంటే కూడా వెనకే ఉన్నారంటూ ఎంపీలకు చురకలు అంటించారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. ఇలాంటి విషయాలను బయటపెట్టిన లీకు వీరుడు ఎవరనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. కమలం పార్టీలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా.. దీని గురించే చర్చ జరుగుతోందట. ఎవరు చేసి ఉంటారు.. ఎవరికి ఆ అవకాశం ఉంది అంటూ.. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారట.

లీకు చేసినోళ్లు మెంటల్‌గాళ్లని ఆగ్రహం..

మోదీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు రావడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. భేటీ వివరాలను లీకు చేసినోళ్లు మెంటల్‌గాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా మోదీ ఆదేశించినా పట్టించుకోకపోవడం విచారకరం అంటూ మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. లీకులు ఇచ్చిన ఎంపీలెవరో మీడియా ప్రతినిధులు చెప్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఐతే ఇక్కడే కొత్త చర్చ జరుగుతోంది. మోదీతో మీటింగ్‌ వివరాలు బయటపెట్టిన వాళ్లను మెంటల్‌గాళ్లు అంటూ కిషన్‌ రెడ్డి సంభోదించారంటే.. విషయం ఎంత సీరియస్సో.. జాతీయ నాయకత్వం ఎలాంటి తీరుతో ఉందో అర్థం అవుతుందనే చర్చ.. సొంత పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

విషయాలను బయటపెట్టింది ఎవరనేది మిస్టరీ..

ఇదంతా ఎలా ఉన్నా.. మోదీ సమావేశ విషయాలను బయటపెట్టింది ఎవరనేది మిస్టరీగా మారింది. ప్రధానితో సమావేశం అయిన వారిలో.. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఎంపీలు కూడా ఉన్నారు. ఇందులో సమావేశ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. కర్ణాటక, కేరళ ఎంపీలకు.. తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రతినిధులతో పెద్దగా పరిచయం ఉండే అవకాశం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల ఎంపీలే.. ఈ విషయాలను బయటపెట్టి ఉంటారనే డిస్కషన్ నడుస్తోంది. దీంతో లీకు వీరుడు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నంలో బీజేపీ నేతలు ఉన్నారట. మరి అది ఎవరో తెలిస్తే.. అసలు విషయం తేలితే.. ఎలాంటి చర్యలు ఉంటాయనేది హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం.. అనర్హత పిటిషన్లు కొట్టివేత