Aroori Ramesh Representative Image (Image Credit To Original Source)
Aroori Ramesh: ఆ నేతకు ప్రయారిటీ ఇవ్వడం ఈయనకు నచ్చలేదు. పైగా ఆయన కూతురుకు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఓపెన్‌గానే తప్పుబట్టారాయన. ఆ కోపంతోనే కమలం గూటికి చేరి ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు తిరిగి కారెక్కారు ఆ ఓరుగల్లు నేత. అయితే ఆయన రాక మరో నేతకు ఆందోళన కలిగిస్తోందట. ఉప ఎన్నిక వస్తే తనకు సీట్ దక్కదేమోనన్న డైలమాలో పడిపోయారట. బై ఎలక్షన్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ మాజీ ఎమ్మెల్యే కారెక్కారా? ఇంకో మాజీ ఎమ్మెల్యే కలవరం అందుకేనా?
బీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కారెక్కారు. మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఈ ఘర్ వాపసీ పరిణామం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. 2014, 2018లో వర్ధన్నపేట నుంచి గెలిచిన ఆరూరి రమేష్, 2023లో ఓటమి తర్వాత ఎంపీ టికెట్ ఆశించారు. అయితే తనను కాదని..కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆరూరి అలిగి బీజేపీలోకి వెళ్లారు. ఆ తర్వాత కడియం కావ్య కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు వెనకడుగు వేసి కాంగ్రెస్ క్యాండిడేట్‌గా పోటీచేసి గెలిచారు. అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినప్పటి నుంచి మళ్ళీ సొంత గూటికి చేరేందుకు ఆరూరి రమేష్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. కానీ ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు ఆయన తిరిగి గులాబీ కండువా కప్పారు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆయన పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలో కడియం శ్రీహరి రాజీనామా చేయడమో, లేకపోతే ఆయనపై అనర్హత వేటు పడటమో ఖాయమని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌కు కచ్చితంగా ఉపఎన్నిక వస్తే కడియం ఓడించి తీరాలని ఓరుగల్లు గులాబీ లీడర్లంతా కసి మీదున్నారట. అయితే ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం, తాటికొండ రాజయ్య కంటే, ఆరూరి రమేష్ అయితే కడియం శ్రీహరిని ధీటుగా ఎదుర్కొంటారని పార్టీ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
కడియంపై ఉన్న వ్యతిరేకతను వాడుకోవాలంటే బలమైన ఎస్సీ నేత అవసరమని..ఆరూరిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నార్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆరూరి చేరికతో తాటికొండ రాజయ్య కాస్త కలవరపడుతున్నట్లు టాక్. ఆరూరికి ఘన్‌పూర్ టికెట్ ఇస్తారేమోనన్న ఆందోళన రాజయ్యలో ఉందట. పైకి మాత్రం ఆరూరి రమేష్ చేరికపై పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతూ లోలోపల మదన పడుతున్నారట రాజయ్య.
వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇప్పటికే మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంచార్జ్‌గా ఉన్నారు. ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమించినప్పటికీ భవిష్యత్‌లో డీలిమిటేషన్ తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావే రంగంలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సమీకరణాలు మారుతాయని, అప్పటివరకు ఆరూరి రమేష్‌ను స్టేషన్ ఘన్‌పూర్ బాధ్యతల్లో ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ తాటికొండ రాజయ్యను కాకుండా కొత్తగా ఆరూరి రమేష్‌ను కడియం మీద పోటీకి దింపడమే కరెక్ట్ అని ఆలోచిస్తోందట బీఆర్‌ఎస్ అధిష్టానం.
పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను వెనక్కి తీసుకోబోమని గతంలో చెప్పిన గులాబీ పార్టీ నేతలు..మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఎవరొచ్చినా ఆహ్వానిస్తామంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఆరూరిని తిరిగి కారెక్కించుకున్నారని అంటున్నారు. ఏదైనా ఆరూరి రాక బీఆర్ఎస్‌లో సరికొత్త ఈక్వేషన్స్‌కు దారితీస్తుందన్న చర్చ అయితే జరుగుతోంది.
Also Read: పెద్ద ప్లానే..! సడెన్‌గా దానం నాగేందర్ యూటర్న్.. కారణం అదేనా?