గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన.. బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలకు ఫైర్ డిపార్ట్మెంట్ కౌంటర్

ప్రమాదం జరిగిన వెంటనే నేరుగా అగ్నిలోకి దూకి సిబ్బంది కాపాడలేరని, మంటలను అదుపు చేసి పొగను పూర్తిగా కంట్రోల్‌లోకి తెచ్చాకే క్లియర్ విజిబిలిటీ ఏర్పడుతుందని చెప్పారు.

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన.. బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలకు ఫైర్ డిపార్ట్మెంట్ కౌంటర్

Updated On : May 31, 2025 / 9:54 AM IST

హైదరాబాద్, పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలను అగ్నిమాపక శాఖ ఖండించింది. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్‌పై బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఫైర్ ఇంజన్ లేటుగా వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఇటీవల ఆరోపణలు చేశారు. ఫైర్ ఇంజన్లో వాటర్ లేదని, టార్చ్ లైట్, మాస్క్, ఆక్సిజన్ లేవని వారు ఆరోపించారు. ఫైర్ సిబ్బంది నిచ్చెన ఎక్కలేక ఇబ్బంది పడ్డారని, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించలేదని అన్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడింది అగ్నిమాపక శాఖ సిబ్బంది కాదని, స్థానికులే కాపాడారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫైర్ ఇంజన్‌లోను లీకేజీలు ఉన్నాయని, ఘటన జరిగిన తర్వాతే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారని ఆరోపించారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలపై ఫైర్ డిపార్ట్మెంట్ స్పందిస్తూ.. అగ్ని ప్రమాద కాల్ వచ్చిన మూడు నిమిషాలలో స్పాట్‌కు ఫైర్ ఇంజన్ వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవన్నది అవాస్తవమని, 4500 లీటర్ల కెపాసిటీ గల వాటర్ టెండర్లు ఉన్నాయని తెలిపారు. అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పిన ప్రతిసారి సమీప వాటర్ బాడీ దగ్గరికి వెళ్లి ట్యాంకును ఫిల్ చేస్తారని చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే నేరుగా అగ్నిలోకి దూకి సిబ్బంది కాపాడలేరని, మంటలను అదుపు చేసి పొగను పూర్తిగా కంట్రోల్‌లోకి తెచ్చాకే క్లియర్ విజిబిలిటీ ఏర్పడుతుందని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ను ఫైర్ సిబ్బందే నిర్వహించారని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల సమయంలో స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొనడం సహజమని పేర్కొన్నారు.

ఫైర్ ఇంజన్లో ఎలాంటి లీకేజీలు లేవని, లోపలికి వెళ్లేందుకు యాక్సెస్ లేకుండా నిర్మాణం ఉందని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వుడ్ వర్క్‌తో నిండిపోయి ఉండటంతో బైకులు, ఇన్వర్టర్ బ్యాటరీలు, పార్కింగ్ మెటీరియల్ అంతా కాలిపోయిందని వివరించారు. వీటి కారణంగా వేడి తీవ్రత ఎక్కువైందని చెప్పారు. లోపలికి వెళ్లేందుకు మార్గం లేకపోవడమే ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. మొత్తంగా మూడు ఫ్లోర్లలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించామని అగ్నిమాపక శాఖ తెలిపింది.