Liquor Sales in Telangana : బాబోయ్ ఫుల్లుగా తాగేశారు. నాలుగు రోజుల్లో మద్యం విక్రయాలు ఎంతో తెలుసా?

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ..

Liquor Sales in Telangana : బాబోయ్ ఫుల్లుగా తాగేశారు. నాలుగు రోజుల్లో మద్యం విక్రయాలు ఎంతో తెలుసా?

Liquor Sales

Updated On : January 2, 2024 / 6:51 AM IST

New Year Celebrations 2024 : నూతన సంవత్సరం వేడుకలు ఏమోకానీ.. మద్యం వ్యాపారం జోరుగా సాగింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2024 సంవత్సరానికి రాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా యువత, పెద్దలు పార్టీల్లో మునిగిపోయారు. దీంతో పలు ప్రాంతాల్లో మద్యం ఏరులైపారింది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల పేరిట యువత ఫుల్లుగా తాగేశారు. వేలాది బాటిళ్లను ఖాళీ చేశారు. ఫలితంగా డిసెంబర్ 28, 29, 30, 31 తేదీల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి.

Also Read : CM Revanth Reddy : శంషాబాద్‌కు మెట్రో.. వయా ఓల్డ్‌ సిటీ

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 28 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 770 కోట్ల మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయింది. దుకాణదారులు బేవరేజస్ కార్పొరేషన్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల చివరి నాలుగురోజుల్లో దుకాణాలు, బార్లకు కలుపుకొని రూ. 770 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఇందులో చివరి రెండు రోజుల్లోనే రూ. 463 కోట్ల వ్యాపారం జరిగింది. దీనిని బట్టి చూస్తే న్యూ ఇయర్ వేడుకల్లో యువత, పెద్దలు ఏ స్థాయిలో మద్యానికి ప్రాధాన్యతనిచ్చారో అర్థమవుతోంది. రాష్ట్రంలో సాధారణంగా నెలకు రూ. 2,500 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ, డిసెంబర్ నెలలో చివరి నాలుగు రోజుల్లోనే నాల్గోవంతు మద్యం విక్రయాలు జరగడం విశేషం.

Also Read : మెట్రో రైలు విస్తరణ.. ఫార్మాసిటీ రద్దుపై క్లారిటీ ఇచ్చేసిన రేవంత్ రెడ్డి.. ఇకపై..

మరోవైపు.. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని మూడు కమీషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 3001 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలో డిసెంబర్ 31న రాత్రి 8గంటల నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకూ డ్రంకన్ డ్రైవర్ పరీక్షల్లో 3001 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. 19 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సువారు అధికంగా ఉన్నారు. 55 మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1243, సైబరాబాద్ 1241, రాచకొండ 517 మంది పోలీసులకు పట్టుబడ్డారు.