Hot Air Balloon Festival
Hyderabad Hot Air Balloon Festival : చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు.
మంత్రి జూపల్లి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బలూన్ అప్పొజి గూడ శివారులో దిగింది.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.
ఒకవైపు ‘ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్’ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని చాటుతుండగా, మరోవైపు ‘హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్స్ ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు.
“డెస్టినేషన్ తెలంగాణ” అనే బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ, కేవలం దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేలా ఇటువంటి సాహసోపేత క్రీడలు (Adventure Sports) ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా, ఒక గొప్ప అనుభూతిని పొందేలా వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ, భాగస్వామ్య పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యమని జూపల్లి పేర్కొన్నారు. ఈ ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ జనవరి 18వ తేదీ వరకు కొనసాగనుంది.