Ganesh : దేశంలోనే భారీ గణేశ ప్రతిమ..ఎక్కడుందో తెలుసా?
తెలంగాణలో భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది భాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే.. ఈ ప్రతిమ పాలమూరు జిల్లాలో ఉంది. ఈ విగ్రహం భక్తులకు ఆకర్షిస్త్తోంది.

Ganesh
కాణిపాకం.. ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు వినాయకుడే గుర్తొస్తాడు. కానీ తెలంగాణలో కూడా అలాంటి ఓ భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది భాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే.. ఈ ప్రతిమ పాలమూరు జిల్లాలో ఉంది. తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో భారీ గణేశ ప్రతిమ విశేషంగా ఆకర్షిస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. దాదాపు 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు వున్న ఈ ఏకశిలా వినాయక విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది.
భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా రాతివిగ్రహం ఎక్కడ ఉంది? అంటే అందరూ తమిళనాడులోనో.. కర్నాటకలోనో ఉంటుందని భావిస్తారు. గ్రామంలోని గణపతి ఏకశిలా రాతి విగ్రహాన్ని… ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని పిలుస్తుంటారు. మరో విశేషం ఏమిటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ అపురూపమైన విగ్రహాన్ని పట్టించుకొనే నాధుడేలేడు.
ఆ విగ్రహానికి గుడి లేదు కనీసం చుట్టూ గోడ కూడా లేదు. విగ్రహం చుట్టూ ఉన్న పొలాలే ఆ మహాగణపతి సామ్రాజ్యం. అందులో పనిచేసుకొనే రైతులే ఆయన భక్తులు. వారు అప్పుడప్పుడు పెట్టే అరటిపండు నైవేద్యంతోనే అంతభారీ గణపతి సర్దుకుపోక తప్పడం లేదు.
ఏడేళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం గురించి వెలుగులోకి వచ్చింది. పంట పొలాల మధ్యే ఈ గణనాధుడు కోలువై ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం పుణెకు చెందిన ఉత్తరదేవి ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామన్న హామీ ఇచ్చారు. కానీ అది అమలు కాలేదు. మైసూరుకు చెందిన వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం కూడా చేశారు.
ప్రస్తుతం ఏదైన పర్వదినం నాడు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. ఈ వినాయకుడికి ఆలయం కోసమని 6 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కూడా ట్రస్టు సభ్యులు అంచనా వేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, లక్ష్మారెడ్డిలు ఆవంచ గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ప్రభుత్వం ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్దులు కోరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం.. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.