హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. హాలీడే కార్డు, స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు మళ్లీ వచ్చేశాయ్
ప్రజలకు మేలు జరిగేలా సేవలు అందించడానికి మెట్రో ఎప్పుడూ సిద్ధమని చెప్పింది.

Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉగాది కానుకలు ప్రకటిస్తున్నట్లు మెట్రో తెలిపింది. ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆధారంగా సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డు, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రజలకు మేలు జరిగేలా సేవలు అందించడానికి మెట్రో ఎప్పుడూ సిద్ధమని చెప్పింది. ఎక్కువ మందిని మెట్రో ప్రయాణం చేసేలా చేయడమే పథకాల ఉద్దేశమని మెట్రో రైల్ తెలిపింది.
హాలీడే కార్డు, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇటీవలే హైదరాబాద్ మెట్రో తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆ కార్డులు ఉన్నవారు నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు వాటిని మళ్లీ పొడిగిస్తుండడంతో ఖుషీ అవుతున్నారు. మొదట హాలీడే కార్డు రూ.59 ఉండేది. ఆ తర్వాత రూ.99కి పెంచారు. మళ్లీ ఆరు నెలల క్రితం హాలీ డే కార్డు ధరను రూ.59కి తగ్గించారు. హాలీ డే కార్డును ప్రభుత్వ సెలవు దినాల్లో వాడుకోవచ్చు.
హాలీడే కార్డు తీసుకున్న వారు రూ.59 చెల్లించి సెలవు రోజున నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్ అంటే రద్దీలేని సమయాల్లో క్లాసిక్ కార్డు ఉన్నవారికి కాస్త తక్కువ ఛార్జి పడుతుంది. మెట్రో స్టూడెంట్ పాస్ ను గత ఏడాది ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మెట్రో రైళ్లలో ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వేసవికాలంలో ఎండల వేడిని తట్టుకోవడానికి, వర్షాకాలంలో వానలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా ఉండడానికి చాలా మంది మెట్రో రైలు ఎక్కుతుంటారు.
Also Read: ఉగాది కానుకగా హారర్ కామెడీ ‘కాజల్ కార్తీక’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?