Hyderabad Rains : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. మూడ్రోజులు జాగ్రత్త..! ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

Telangana Rains : హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ఏదోఒక ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hyderabad Rains

Telangana Rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ఏదోఒక ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచింది. దీంతో ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: Gold Price Today : ఆహా.. పండుగకు ముందు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?

సిటీలో కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్, జిల్లా రెవెన్యూ, విద్యుత్, హెల్త్ వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత జాగ్రత్తగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే స్పందించాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లేలా ఫీల్డ్ లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీస్ శాఖకు సూచించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు దగ్గరగా ఉండకుండా ప్రజలకు సూచించాలని, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోనేలా ప్రజలకు సూచనలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.


శుక్రవారం హైదరాబాద్‌లో వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రాత్రి 10గంటల వరకు ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 11.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగోల్ బండ్లగూడలో 9.33 సెంటీమీటర్ల వర్షం కురవగా.. హయత్ నగర్ లో 6.13 సెంటీమీర్ల వర్షం కురిసింది. అదేవిధంగా తట్టి అన్నారంలో 5.8 సెంటీమీటర్ల వాన పడింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో వరుస వానలతో జీహెచ్ఎంసీ అప్రత్తమైంది. నాలాల్లో అడ్డంకులు లేకుండా చూడటం, వ్యర్థాల తొలగింపు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.