టూవీలర్లు వినియోగించే వారందరూ ఇది పాటించాల్సిందే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రిక్వెస్ట్
మనదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో బైకిస్టులే ఎక్కువ మంది చనిపోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అందుకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు...
strapping helmets: యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, మతపరమైన అల్లర్లలో కంటే మనదేశంలో ఎక్కువమంది రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల కామెంట్ చేశారు. ఆయన చెప్పింది.. అక్షరాల నిజం. మనదేశంలో ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. 3 లక్షల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. బాధితుల్లో దాదాపు 65 శాతం మంది యువకులు, మహిళలలే ఉండడం మరింత కలవరపరిచే అంశం.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే టూవీలర్ యాక్సిడెంట్లలోనే ఎక్కువ మంది చనిపోతున్నారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022లో దాదాపు 75 వేల మంది బైక్ రైడర్లు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. అందుకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు భద్రత పట్ల అవగాహన కల్పిస్తున్నారు. బైక్ నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బైక్ రైడర్లకు వివరిస్తున్నారు.
హెల్మెట్ ధరించినా కూడా కొంత మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడాన్ని గమనించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. హెల్మెట్ ధరించడంతో పాటు బెల్ట్ (స్ట్రిప్) కూడా పెట్టుకోవాలని బైక్ రైడర్లను కోరుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగిన వారికి స్ట్రిప్ పెట్టుకోవడం వల్ల జరిగే మేలు గురించి వివరిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి బండి మీద నుంచి కిందపడినా హెల్మెట్ జారిపోకుండా ఉంటుందని, తద్వారా తలకు దెబ్బలు తగిలే ప్రమాదం తప్పుతుందని చెబుతున్నారు. హెల్మెట్ ధరించే వారు కచ్చితంగా స్ట్రిప్ పెట్టుకోవాలని పునరుద్ఘాటిస్తున్నారు.
Also Read: యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు: నితిన్ గడ్కరీ
మంచిపని చేస్తున్నారంటూ..
ట్రాఫిక్ పోలీసుల చేపట్టిన అవగాహన కార్యక్రమాలను హైదరాబాదీలు స్వాగతిస్తున్నారు. మంచిపని చేస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు. హెల్మెట్‌ను వినియోగించే వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని, ప్రమాదాల బారిన పడినప్పడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి దోహదపడుతుందని అంటున్నారు. అయితే స్ట్రిప్ పెట్టుకోవడంలో కనీస జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. హెల్మెట్ జారిపోకుండా బిగుతుగా స్ట్రిప్ పెట్టుకుంటేనే ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. టూవీలర్లు వినియోగించే వారందరూ కచ్చితంగా ఇది పాటించాలని కోరుతున్నారు.
Hyderabad Traffic Police are sensitizing commuters on the importance of straping the helmets.
Currently, 90% of those who wear helmets do not secure the straps, which undermines the safety purpose of wearing a helmet.@HYDTP @AddlCPTrfHyd @hydcitypolice pic.twitter.com/zbpcYTzkcu
— Lokendra Singh (@HYDTrafficMan) September 4, 2024