యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు: నితిన్ గడ్కరీ
మనదేశంలో ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయని.. 3 లక్షల మంది వరకు క్షతగాత్రులవుతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Road Accidents Killed More Indians than Wars: Nitin Gadkari
Nitin Gadkari on Road Accidents: మనదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఎలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా? యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, మతపరమైన అల్లర్లలో ఎక్కువ మంది చనిపోతున్నారని మీరకుంటే.. పొరబడినట్టే. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన FICCI రోడ్ సేఫ్టీ అవార్డ్స్, కాన్క్లేవ్ 2024లో ఆయన విస్మయకర వాస్తవాలను బయటపెట్టారు. మనదేశంలో ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మరణాలు నమోదవుతున్నాయని.. 3 లక్షల మంది వరకు క్షతగాత్రులవుతున్నారని తెలిపారు. బాధితుల్లో దాదాపు 65 శాతం మంది యువకులు, మహిళలలే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జీడీపీలో దాదాపు మూడు శాతం నష్టం వాటిల్లుతోందని వివరించారు.
సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిందే..
చైనా లేదా పాకిస్థాన్ యుద్ధాలు కావచ్చు, నక్సల్స్ దాడులు, మతపరమైన అల్లర్లు.. శాంతిభద్రతలకు విఘాతం ఘటనల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే ప్రమాదాలు జగినప్పుడు డ్రైవర్లను నిందిస్తుంటారని, కానీ రోడ్లు సరిగా లేకపోవడం వల్లే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్నారు. అన్ని రహదారులపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇంజనీరింగ్ లోపాలతో రహదారుల నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని, సరైన ప్రణాళికలు కూడా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో రహదారుల నిర్మాణంలో ప్రమాణాలు కొరవడుతున్నాయని వాపోయారు.
హనుమంతుడి తోకలా బ్లాక్ స్పాట్స్
ప్రభుత్వం వైపు నుంచి లోపం ఉందని, తక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్లు ఇస్తున్నారని.. దీంతో నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు వెతుకుతున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్.. హనుమంతుడి తోకలా పెరిగిపోతూనే ఉన్నాయని గడ్కరీ ఆవేదన చెందారు. 2001లో తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ఆ దుర్ఘటన కారణంగా రెండేళ్ల జీవితాన్ని కోల్పోయానని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేన్ డిసిప్లేన్ ఫాలో కావాలని ఆయన సూచించారు.
Also Read: హెల్మెట్ పెట్టుకొని బస్సులు నడిపిన డ్రైవర్లు.. కారణం ఏమిటంటే..? వీడియోలు వైరల్
అంబులెన్స్ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ
రోడ్డు ప్రమాద బాధితులను త్వరగా రక్షించేందుకు అంబులెన్స్ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. యాక్సిడెంట్ సమయంలో వాహనాల్లో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసేందుకు.. కట్టర్లు వంటి అధునాతన యంత్రాలను ఉపయోగించడంలో అంబులెన్స్ డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. అలాగే ఆపద సమయాల్లో ఆదుకునే అంబులెన్స్‌ల కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పెషల్ కోడ్‌లను సిద్ధం చేస్తోందని గడ్కరీ తెలిపారు.
Also Read: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీటుకు ఎసరు.. ఏం జరుగుతుందోనని టెన్షన్!