Hyderabad Bus Terminals : నగర కాలుష్యం, ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ చుట్టూ 4 కొత్త బస్ టెర్మినల్స్.. 2,200 ఎలక్ట్రిక్ బస్సులు
Hyderabad Traffic Relief : హైదరాబాద్ ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరానికి నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 2,200 ఎలక్ట్రిక్ బస్సులతో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయనుంది.
Hyderabad Traffic Relief
- గాజులరామారం నుంచి శంషాబాద్ వరకు కొత్త బస్ టెర్మినల్స్
- నగరంలోకి ఇక దూరప్రాంత బస్సులకు నో? పొన్నం ప్రభాకర్ ప్రకటన
- కొత్త టెర్మినల్స్తో హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు బూస్ట్
Hyderabad Traffic Relief : హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్లాన్ సిద్ధం చేస్తోంది. నగరానికి నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా దూరప్రాంత, అంతర్జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి రాకుండా నియంత్రించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఏయే ప్రాంతాల్లో బస్సు టెర్మినల్స్ :
శంషాబాద్, ఎల్బీనగర్, గాజులరామారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను (Hyderabad Bus Terminals) ప్రభుత్వం పరిశీలిస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి వచ్చే బస్సులను ఆయా ప్రాంతాల్లోని టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది.
ప్రయాణికులకు ఈజీ కనెక్టివిటీ :
టెర్మినల్స్‌కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు.
ప్రైవేట్ బస్సులను కూడా నిర్దేశిత టెర్మినల్స్ నుంచే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు, నగరంలోకి వచ్చేవారికి వేగవంతమైన పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ సౌకర్యాన్నిఅందించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
త్వరలోనే 2200 ఎలక్ట్రిక్ బస్సులు :
టెర్మినల్స్ కోసం గాజులరామారంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ వైపు సుమారు 150 ఎకరాల భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. మరోవైపు, నగర ప్రజా రవాణాకు త్వరలో రానున్న 2,200 ఎలక్ట్రిక్ బస్సులను ఈ వ్యవస్థతో లింక్ చేయనున్నారు. ఈ ప్లాన్ అమల్లోకి వస్తే హైదరాబాద్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి, కాలుష్యం భారీగా తగ్గనుంది.
