హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా హడల్.. ఆ చెరువులను పరిశీలించి వార్నింగ్ ఇచ్చిన కమిషనర్ రంగనాథ్..
అటువంటి పనులు చేసే వారిపై యాక్షన్ తప్పదు.

Hydra : హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా దూకుడు పెంచింది. చందానగర్ లోని పలు చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లి గవాడ్ సమక్షంలో భక్షికుంట, రేగులకుంట చెరువులను రంగనాథ్ సందర్శించారు. డ్రైనేజ్ వాటర్ చెరువుల్లో కలవకుండా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో నేరుగా సీవెజ్ వదిలినా, కాలుష్య కారకాలు వదిలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇక తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసి తీరును లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లి గవాడ్ వివరించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును కమిషన్ కు తెలియజేశారు గవాడ్. అటు రేగులకుంట చెరువులో నీటి స్వచ్ఛతను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
‘హైడ్రా పరిధిలో ఉన్న వాటిని తప్పకుండా అడ్రస్ చేస్తాం. భక్షికుంటలో కొంతమంది బిల్డర్లు పర్మిషన్ తీసుకుని కట్టుకుంటున్నారు. వారు కూడా షెడ్లు వేసి సీవెజ్ ను చెరువులో వదులుతున్నారు. వేస్ట్ వాటర్ ను సరిగా ట్రీట్ చేయకుండానే వదిలేస్తున్నారు. ఇలాంటివి మా దృష్టికి వచ్చాయి. అటువంటి పనులు చేసే వారిపై యాక్షన్ తప్పదు. అలా చేయొద్దని చెప్పాము. 10 రోజుల్లో రెక్టిఫై చేసుకుంటామని వాళ్లు చెప్పారు. అలా చేయకపోతే కనుక కచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి. ఎవరైతే చెరువులోకి డైరెక్ట్ గా కాలుష్య కారకాలను వదులుతున్నారో వారి మీద పొల్యూషన్ బోర్డు సహకారంతో చర్యలు తీసుకుంటాము” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : గ్రామస్తులను రెచ్చగొట్టింది ఇతడే..! లగచర్ల ఘటనలో సూత్రధారి రాఘవేందర్ సస్పెండ్..