చిన జియర్ స్వామిజీకి సీఎం జగన్, వెంకయ్య పరామర్శ

Tridandi Chinna Jiyar Swamy : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని సీఎం జగన్ పరామర్శించారు. చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ సంతాపం తెలియచేశారు. స్వామికి ఫోన్ చేసిన ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
వెంకయ్య నాయుడు సంతాపం :
చినజీయర్ స్వామి వారి మాతృమూర్తి మంగతాయారు పరమపదించడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. చిన జీయర్ కు ఫోన్ చేసిన వెంకయ్య.. కొద్దిసేపు మాట్లాడారు. తన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి సంతాప సందేశాన్ని విడుదల చేసింది.
సంప్రదాయ మధ్యతరగతి గృహిణిగా పిల్లల జీవితాలను ఆమె తీర్చిదిద్దిన తీరు ఆదర్శనీయం అన్నారు. చిన్నతనం నుంచే భారతీయ సనాతన విలువలు, సంప్రదాయాలు, దయా గుణం, సామాజిక చింతన వంటివి పిల్లల మనసుల్లో నాటడం ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దవచ్చో మంగతాయారు పెంచిన తీరు నుంచి గ్రహించవచ్చన్నారు. స్వామి వారి ధార్మిక, సామాజిక దృష్టి కోణాన్ని బాల్యం నుంచే ప్రభావితం చేయడంలో ఆమె పాత్ర ఎనలేనిదని ఉపరాష్ట్రపతి వెల్లడించారు.
2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటలకు అలివేళు కన్నుమూశారు. చరమక్రియలు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ లో జరిగాయి. తల్లి మంగతాయారు పట్ల చినజీయర్ స్వామి ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు.