దేశంలో 14 గంటలు..తెలంగాణాలో 24 గంటలు

కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అందులో భాగంగా..2020, మార్చి 22వ తేదీ ఆదివారం స్వచ్చందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. పలు రాష్ట్రాలు స్వాగతించాయి. ప్రజలు బయటకు రావొద్దని పిలుపునిచ్చాయి. ప్రజా రవాణాపై పలు ఆంక్షలు విధించాయి. మెట్రో, ఆర్టీసీ సేవలను నిలిపివేశాయి. అయితే..దేశానికి ఆదర్శంగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
అయితే..దేశం 14 గంటలు పాటిస్తే..రాష్ట్రం 24 గంటల పాటు బంద్ పాటించాలని ఆయన కోరారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఉదయం 7 గంటలకు షాపులు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ, మెట్రోలు డిపోలకు పరిమితం అయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు.
ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్టు, అత్యవసర సేవల కోసం కేవలం 5 బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇతర రాష్ట్రాల బస్సులను సరిహద్దులోనే ఆపేస్తామని, మెట్రో రైళ్లు కూడా తిరగవని ఆయన ప్రకటించారు. వైద్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖల వారు మినహా…మిగిలిన వారంతా కర్ఫూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.