కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వ రేసులో ఆ నలుగురు నేతలు.. వీరే..
యువ నాయకుడు కావడం, చాలా కాలం నుంచి స్థానిక సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఓ నేతకు కలిసి వస్తున్నాయి.

Jubilee Hills By Poll
Jubilee Hills By Poll: కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కొన్ని రోజులుగా అభ్యర్థుల వేటలోనే మునిగిపోయాయి. అన్ని లెక్కలు వేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి ప్రధానంగా దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థిత్వ రేసులో ఉన్నారు. వారిలో ఒకరి పేరును అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఆ నలుగురి పేర్లను ఇప్పటికే ఇన్‌చార్జి మంత్రులు ప్రతిపాదించినట్లు సమాచారం. నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లో గెలిచే ఛాన్స్ ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాలని ఈ విషయంలో ఇన్‌చార్జులుగా ఉన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దీంతో ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని నలుగురి పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ నలుగురి పేర్లను ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఇన్‌చార్జ్ మంత్రులు ఇచ్చారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి వెళ్లారు. అంతకు ముందే ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌తో వారు సమావేశమయ్యారు.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి అంశంపై కూడా చర్చించారు. ఈ విషయంపై ఇవాళ లేదా రేపు రేవంత్‌రెడ్డితో భట్టి విక్రమార్క, మహేశ్‌గౌడ్, మీనాక్షీ నటరాజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది.
నలుగురిలో నవీన్ యాదవ్‌వైపే మొగ్గు?
అభ్యర్థిత్వంపై నలుగురి పేర్లతో ఏఐసీసీకి టీపీసీసీ ప్రతిపాదనలు చేయనుంది. సర్వేల ఆధారంగా అభ్యర్థిపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది. నేడో, రేపో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్‌లో ఒకరిని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. దీంతో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు బాగా వినపడుతున్నాయి. వారిలో నవీన్ యాదవ్‌వైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
యువ నాయకుడు కావడం, చాలా కాలం నుంచి స్థానిక సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఆయనకు కలిసి వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం నుంచి ఆయన పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గతంలో ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి. ఇక బొంతు రామ్మోహన్ గతంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం పంచుకున్న అనుభవం బొంతు రామ్మోహన్‌కు ఉంది. ఇక అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.