Satish
Justice Satish Chandra Sharma Swear in : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ.. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్… జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాజ్‌భవన్ అధికారులు పూర్తి చేశారు.
గత నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతులు కల్పించింది. ఐదుగురు సీజేలను బదిలీ చేయాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ నియమితులయ్యారు. ఇవాళ ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు.
MAA Elections: ‘మా’ ఎన్నికలు.. విజేతల పూర్తి వివరాలు..!
జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు. అందులోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన.. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మొన్నటి వరకు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.