Kalvakuntla Kavitha : KTR కి కవిత సూటి ప్రశ్న.. ‘పదేళ్లు అధికారంలో ఉన్నారు.. ఇప్పుడెందుకు పాదయాత్ర’
Kalvakuntla Kavitha : కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై స్పందిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
kalvakuntla kavitha about ktr padayatra and her new party announcement
Kalvakuntla Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న కొత్త పార్టీపై ప్రకటన చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాము ప్రకటించే కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ మదర్ బోర్డ్ గా ఉంటుందన్నారు. తెలంగాణ కోసం… తెలంగాణ చేత… తెలంగాణ ఏర్పాటు చేసుకుంటున్న రాజకీయ పార్టీగా నిలుస్తుందని తెలిపారు. కొత్త పార్టీ స్థాపనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.
ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తాం అన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు కూడా ఆవిర్భావ సభలో పాల్గొంటారని తెలిపారు. ఏప్రిల్ 25 ఉదయం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆవిర్భావ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మార్గమధ్యలో పార్టీ జెండా ఆవిష్కరించుకుంటూ వస్తామన్నారు. తిరుగు మార్గంలో అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం తర్వాత కార్యక్రమాలు ఉధృతం చేస్తాం; పాదయాత్ర లాంటి వాటి కోసం ఇంకా సమయం ఉందన్నారు.
పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. కేటీఆర్ పదేళ్లు ప్రజలకు దూరంగా ఉన్నారని, ఇప్పుడు పాదయాత్ర అంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారని విమర్శించారు. పార్టీ కమిటీల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది, జాగృతిలో ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో అన్నివర్గాలకు అధికారం రావాలన్నదే తన ధ్యేయమని వ్యాఖ్యానించారు. అందరికీ అధికారమని మాట్లాడుతారని.. దీనిని ఆచరణలోకి తీసుకురావాలని తాను ప్రారంభించాకే తనకు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.
