Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నెల చివరి వారంలో ఆమె జిల్లాల యాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత ఈ యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఆర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. మూల విరాట్‌ను దర్శించుకుని కవిత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కవితకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచరం ఇచ్చారు. (Kalvakuntla Kavitha)
Also Read: మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరు ఖరారు.. ఎన్డీఏకి గెహ్లోట్ సవాల్..
కొత్త పార్టీ పెడతారా? అన్న అంశంపై కవిత మీడియా మాట్లాడుతూ.. ప్రజలు కోరుకుంటే సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకునే లక్ష్యంతో ఉన్నామని, ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
“యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాను. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రజలతో మమేకం అయ్యేందుకు చేపట్టబోయే తెలంగాణ జాగృతి “జనం బాట” కార్యక్రమానికి నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించాను” అని కవిత ట్వీట్ చేశారు.
కాగా, తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో లేకుండానే కవిత యాత్ర చేయనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. ఆయా అంశాలపై ఆమె మేధావులు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జనం బాట యాత్ర పేరుతో యాత్రను ప్రారంభిస్తారు.