కరోనాపై గెలిచిన కరీంనగర్..ఎలానో తెలుసా

కరోనాపై కరీంనగర్ గెలిచింది. పకడ్బందీ చర్యలతో వైరస్ వ్యాపించకుండా సత్ఫలితాలు సాధించింది. ప్రభుత్వ యంత్రాంగం కృషి.. ప్రజాప్రతినిధుల సంకల్పానికి ప్రజల సహకారం తోడవ్వడంతో మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. కరోనాపై ఇలా పోరాడాలంటూ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది.
మార్చి 16.. ఇండోనేషియా దేశస్తుల్ని కరోనా అనుమానితులుగా గుర్తించి కరీంనగర్ నుంచి 13 మందిని గాంధీకి తరలించారు.
మార్చి 17.. 13 మంది ఇండోనేషియా వాసుల్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది.
మార్చి 18.. మరో ఏడుగురికి పాజిటివ్ కన్‌ఫర్మ్ అయ్యింది.
మూడ్రోజుల్లోనే ఎనిమిది పాజిటివ్ కేసులు :-
ఇలా మూడ్రోజుల్లోనే ఎనిమిది పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో కరీంనగర్ ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిత్యం జనం రాకపోకలతో కిటకిటలాడిన నగరం వెలవెలబోయింది. ఎక్కడి వ్యాపారాలు అక్కడే ఆగిపోయాయి. అసలు కరీంనగర్‌లో ఏం జరుగుతోందని మిగిలిన జిల్లాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు వైపే చూశాయి. ఇండోనేషియా దేశస్తులు ఎక్కడ్నుంచి వచ్చారు? ఎక్కడ తిరిగారు? ఎవరెవర్ని కలిశారనే విషయాలు ఆరా తీసి… వారందర్నీ క్వారంటైన్ చేశారు.
3 వేల 708 ఇళ్లు దిగ్భందం : –
తొలుత కరీంనగర్‌లో ఇండోనేషియన్లు బస చేసిన ప్రార్థన మందిరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్ని పోలీసులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతంలోని మొత్తం 3 వేల 708 ఇళ్లను దిగ్బంధం చేశారు. ప్రత్యేక వైద్యబృందాలు ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహించడంతోపాటు అనుమానితుల్ని క్వారంటైన్‌కు తరలించారు. కరీంనగర్‌తోపాటు హుజూరాబాద్‌లోనూ 7 కట్టడి ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల నుంచి ఏ ఒక్క వ్యకినీ బయటకి రాకుండా చూశారు. ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో మొన్నటివరకు 19గా ఉన్న కేసుల సంఖ్య… నాలుగుకు పడిపోయింది.
మంత్రి గంగుల పర్యటన :-
మర్కజ్ మినహా.. కొత్త కేసులు రాకుండా అరికట్టడంలో అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు ఎనలేని కృషి చేశారు. ఒకటి తర్వాత ఒకటి ఎనిమిది కేసులు వచ్చాయని తెలియగానే మంత్రి గంగుల కమలాకర్ రాత్రికి రాత్రే కరీంనగర్ చేరుకుని కలెక్టర్, సీపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించొద్దన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్షన్‌ప్లాన్ తయారు చేశారు. నో మూమెంట్ జోన్‌లోకి వెళ్లడానికి ఎవరూ సాహసం చేయని టైంలో మంత్రి కమలాకర్, అధికారులు కలిసి వెళ్లి అక్కడి వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు.
నిత్యావసర సరుకుల పంపిణీ :-
అంతేకాదు, కొంతమంది వైద్య పరీక్షలకు ముందుకురాని సమయంలో.. స్వయంగా మంత్రి సదరు కాలనీలకు వెళ్లి సముదాయించి ఒప్పించారు. అనంతరం ఇండోనేషియా వాసులు తిరిగిన ముకరంపుర, కశ్మీరగడ్డ ఏరియాల్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా.. ఎవరూ లోపలికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులు ఇళ్లకే వెళ్లి పంపిణీ చేశారు. ఇక్కడి మసీదుతో పాటు ఆ ఏరియాల్లో డిస్‌ఇన్‌ఫెక్షన్ లిక్విడ్‌ను స్ప్రే చేశారు.
అధికారుల సమీక్షలు :-
అప్పటికే వీరితో సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తికి.. వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి వైరస్ సోకింది. అలాంటి పరిస్థితుల్లో కట్టడి చేయకపోయుంటే మరింతగా వైరస్ వ్యాప్తి చెందేదని నిపుణులు అంటున్నారు. నగరంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో.. ఇటు మున్సిపల్, పోలీసు శాఖలతో కలెక్టర్, మంత్రి నిత్యం సమీక్షలు నిర్వహించి తెలుసుకున్నారు. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్లాన్ అమలు చేశారు. చల్మెడ, ప్రభుత్వాస్పత్రి, శాతవాహన యూనివర్సిటీలలో క్వారంటైన్లను ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది వరకు క్వారంటైన్లకు తరలించారు.
పారిశుధ్యంపై దృష్టి..రసాయనాల స్ర్పే :-
చల్మెడలో ఐసోలేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేశారు. వైరస్ కట్టడికి మున్సిపల్ అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. పారిశుధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రంలోనే మొదటిసారిగా సోడియం హైపోక్లోరిడ్ లిక్విడ్‌ను స్ప్రే చేయించారు. నగరంలోని వెడల్పు రోడ్ల మీద డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే చేపట్టడానికి ట్రాక్టర్లు, పవర్ స్ప్రేలు, కొన్నిచోట్ల డ్రోన్లను వినియోగించారు. ఇది ఒక్క రోజుకే పరిమితం కాకుండా మున్సిపల్ సిబ్బందికి 200 పవర్ స్ప్రేలు అప్పగించి అన్ని గల్లీల్లోనూ చేయించారు. బస్టాండ్, మార్కెట్, కలెక్టరేట్ లాంటి పెద్ద ఏరియాల్లో స్ప్రే చేయడానికి ఫైర్ సిబ్బందిని వినియోగించారు.
ప్రధానపాత్ర సోషల్ డిస్టెన్స్ :-
కరీంనగర్‌లో కరోనా కట్టడిలో ప్రధానపాత్ర సోషల్ డిస్టెన్స్ అనే చెప్పాలి. లాక్‌డౌన్ విధించిన తొలి రోజుల్లో నగరవాసులు చాలామంది మార్కెట్‌కు గుంపులు గుంపులుగా వచ్చేవారు. దీన్ని గుర్తించిన ఆఫీసర్లు ప్రధాన ప్రాంతాలతో కలిపి అదనంగా 16 మార్కెట్లు ఏర్పాటు చేశారు. వీటిని బస్టాండ్, మార్కెట్‌యార్డులో విశాలమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఎంతో ఊరట కలిగింది.
ఊపిరిపీల్చుకుంటున్న కరీంనగర్ : –
సామాజిక దూరం పాటించేలా మున్సిపల్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు 250 మంది వలంటీర్లను నియమించారు. వీరు నగరవాసుల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. మొత్తానికి ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం… ప్రజల సహకారంతో కరీంనగర్‌లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. అందరికంటే ముందు బాధితులుగా మారి టెన్షన్ పడినా… ఇప్పుడు కరోనా కేసులు తగ్గిపోవడం.. కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కరీంనగర్ ఊపిరి పీల్చుకుంటోంది.