MLC Kavitha
ఆమె తెలిసే అలా మాట్లాడారా..? తెలియక మాట్లాడారా? లేదంటే కావాలనే అలా మాట్లాడారా? ఇంతకీ ఆమె మాటల వెనకున్న ఆంతర్యమేంటీ? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
తన తండ్రి..మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పరిపాలన విధానాన్ని పరోక్షంగా కవిత తప్పుబట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కవిత పార్టీకి ప్యార్ లల్ గా జాగృతితో జనాల్ని జాగృతం చేస్తున్న ఆమె..ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. ప్రతిపక్షాలు మాట్లాడేలా ఉన్న ఈ మాటలు అన్నది మరెవరో కాదు..సాక్షాత్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల మాట్లాడిన మాటలివి.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సరిగానే మాట్లాడారని కాంగ్రెస్ విప్ బీర్ల ఐలయ్య కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్సీ కవిత ఏది మాట్లాడినా ఆచితూచే మాట్లాడతారని అంతా అంటుంటారు. కానీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఓ రకంగా తప్పుబడుతూ ఆమె మాట్లాడారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రి కేసీఆర్ పాలనా విధానాలను కవిత తప్పుబట్టడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు..సొంతపార్టీ బీఆర్ఎస్ లోనూ ప్రకంపనలు రేపుతున్నాయట.
సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కవిత.. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు ఉండాలన్నారు. అలాగే రైతుబంధు కింద ఎకరం ఉంటే పది వేలు..పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చామని..కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని నాటి సీఎం కేసీఆర్ విధానాన్ని తప్పుబట్టారు. భవిష్యత్తులో భూమి ఉన్నా..లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
Also Read: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో iPhone 16 Proపై భారీ డిస్కౌంట్.. ఎంతంటే?
అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉదాహరించారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే.. వికారాబాద్ జిల్లాలో లక్షా 58 వేలు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. పది కిలోమీటర్లు దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ప్రమాదకరమని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మే డే స్పూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవటానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత చేసిన ఈ నర్మగర్భ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తెలంగాణ వచ్చాక సుమారు పదేళ్ల పాటు ఆమె తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్నారు. మరి నాటి ప్రభుత్వం చేపట్టిన రైతుబంధులో తప్పులతో పాటు సామాజిక అసమానతలను కవిత ఎత్తి చూపారన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో మొదలైందట.
సొంత పార్టీ పరిపాలన, అందులోను తండ్రి సీఎంగా ఉన్న ప్రభుత్వంలోని లోపాలను కవిత తప్పుబట్టడం చూస్తుంటే కేసీఆర్ విధానాలనే వ్యతిరేకించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయని, ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా రాజకీయాలు చేస్తున్నారన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో విన్పిస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావు, కవిత ముగ్గురు వేర్వేరుగా రాజకీయం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో తెరవెనుక చర్చ జరుగుతోందన్న టాక్ విన్పిస్తోంది.
అయితే ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ అధిష్టానంతో సంబంధం లేకుండా కవిత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారంటూ రాజకీయవర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉంటూ రాజకీయంగా కవిత ఫుల్ యాక్టీవ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి సమయంలో సొంత పార్టీ పాలనను తప్పుబడుతూ, కేసీఆర్ పరిపాలనా విధానాలను తప్పుబట్టడం ఇంట్రస్టింగ్ గా మారింది.
ఇంతకీ కవిత ఆంతర్యం ఏంటో గాని ఆమె వ్యవహారశైలి మాత్రం కుటుంబాన్ని, పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ సభ్యులు ఇప్పటికే స్పందిస్తే ఆమె సరిగానే మాట్లాడారంటూ గులాబీ పార్టీపై కౌంటర్లు ఇస్తున్నారని…ఇది హస్తం పార్టీకి అస్త్రంగా మారిందని గులాబీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరి కవిత ఏ ఉద్దేశ్యంతో ఈ కామెంట్స్ చేశారో..ఆమె తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందోనన్నది ఇటు బీఆర్ఎస్ లోనే కాకుండా అటు రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.