KCR Strategy: ఆశావహులు, అసమ్మతి నేతలు జారిపోకుండా కేసీఆర్ కొత్త వ్యూహం.. జంప్ జిలానీలకు చెక్!

సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే తమ నేతకు భోజనానికి పిలవడం.. ఆప్యాయంగా మాట్లాడటంతో మధు వర్గంలోనూ ఆనందం నెలకొనగా.. టిక్కెట్ తనదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు మధు.

KCR New Strategy

KCR New Strategy: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలిచి.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు బీఆర్ఎస్ అధినేత (BRS Party Chief) కేసీఆర్. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో.. చాపకింద నీరులా ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు గులాబీ బాస్. ప్రత్యర్థులను పడగొట్టడమే కాదు.. పార్టీ నేతలను కాపాడుకోవడమూ సీఎం కేసీఆర్ కి ముఖ్యంగా మారిందట. ఇప్పుడు.. దాదాపు 25 నియోజకవర్గాల్లో అసంతృప్తులు (dissidents) పెరిగిపోవడం.. గులాబీ దళపతికి చికాకు తెప్పిస్తోంది. ఇలా అసంతృప్త స్వరాలు వినిపిస్తున్న నేతలకు తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు కేసీఆర్.. అసమ్మతి నేతలను దారికి తెచ్చే వ్యూహమేంటి?

గత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వేరు.. రానున్న ఎన్నికలు వేరన్న విషయం గుర్తించారు సీఎం కేసీఆర్. గతంలో తెలంగాణ సెంటిమెంట్.. ఇతర పార్టీల నేతలకు గాలం వేసి ఎన్నికల్లో సునాయాసంగా గెలిచిన గులాబీ పార్టీకి ఈ సారి పూర్తి భిన్నమైన రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. తెలంగాణ సెంటిమెంట్‌ను స్వహస్తాలతో అటకెక్కించింది కారు పార్టీ.. అదే సమయంలో హస్తం పార్టీ అనూహ్యంగా పుంజుకుని గులాబీ నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లతో కిక్కిరిసిపోయిన కారు పార్టీకి.. కాంగ్రెస్ ఆకర్ష్ కంగారు పుట్టిస్తోందట.. ఎన్నికల ముందు నేతలు జారిపోతే.. చాలా ఇబ్బందే అని గమనించిన గులాబీ బాస్.. నేతలు ఎవరూ జారిపోకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

గతంలో విపక్ష నేతలను కారెక్కించుకుని జోరుగా షికారు చేసిన గులాబీదళానికి.. ఇఫ్పుడు ఎవరూ కారు దిగకుండా కాపాడుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ.. ఆశావహులను ఆశల పల్లకిలో ఉంచుతూ నొప్పించక.. తానొవ్వక అన్నట్లు కారును నడపాలని భావిస్తున్నారట సీఎం కేసీఆర్. ఇలా ముఖ్యమంత్రి వైఖరి మారిందని చెప్పటానికి పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ముచ్చటను ప్రధానంగా చెబుతున్నారు. ఆ మధ్య పటాన్‌చెరులో పర్యటించిన సీఎం కేసీఆర్.. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) కి టిక్కెట్ కన్ఫార్మ్ చేసేశారు. మహిపాల్‌ను మరోమారు దీవించి పంపండని బహిరంగ సభలో ప్రజలను కోరారు సీఎం.

Also Read: ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా.. ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టాస్క్ ఏంటి?

మరోవైపు టిక్కెట్ రేసులో ఉన్న యువనేత నీలం మధు (Neelam Madhu Mudiraj)కు సైతం సీఎం భరోసా ఇచ్చారట. అదే రోజు కొల్లూరులో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో యువనేత నీలం మధుతో ప్రత్యేకంగా మాట్లాడారు. బాగా పనిచేస్తున్నావ్ అంటూ మధును ప్రశంసించడమే కాదు.. తనతో భోజనానికి రమ్మంటూ స్వయంగా ఆహ్వానించారు. అంతేకాదు.. మధును తీసుకురమ్మంటూ అక్కడే ఉన్న మంత్రి హరీశ్‌రావును పురమాయించారట గులాబీబాస్.

Also Read: కాకరేపిన ‘కరెంట్’ కామెంట్లు.. రేవంత్‌రెడ్డిపై రగులుతున్న సీనియర్లు

సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే తమ నేతకు భోజనానికి పిలవడం.. ఆప్యాయంగా మాట్లాడటంతో మధు వర్గంలోనూ ఆనందం నెలకొనగా.. టిక్కెట్ తనదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు మధు. ఇంకోవైపు ఎమ్మెల్యే మహిపాల్ ను మరోసారి ఆశీర్వదించాలంటూ సీఎం కోరడంతో ఆయన కూడా ఉత్సాహంలో ఉన్నారు. ఇలా ఒకే సమయంలో కేసీఆర్ చేసిన మ్యాజిక్ తో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు టిక్కెట్ ఆశిస్తున్న మధు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారట.. ఇలా మధు ఒక్కరే కాదు.. కేసీఆర్ లిస్టులో ఉన్న 25 నియోజకవర్గాల నేతలు అందరి పరిస్థితీ ఇదేనని చెబుతున్నారు పరిశీలకులు. ఇప్పటికే సిట్టింగుల్లో 30 మందికి మళ్లీ టిక్కెట్లు దక్కే పరిస్థితి లేదని ప్రగతిభవన్ టాక్. వీరికి ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను కూడా సిద్ధం చేశారని చెబుతున్నారు. అయితే టిక్కెట్లు దక్కని సిట్టింగులు కాని.. చాన్స్ లభించని ఆశావహులు కానీ కారు దిగిపోకుండా ఇలా లాక్ చేసేస్తున్నారన్న టాక్ గులాబీదళంలో గుప్పుమంటోంది.

Also Read: కమలం పార్టీకి మరో కొత్త చిక్కు.. నెత్తి నొప్పి తెచ్చిన నేతల భద్రత

ఆశావహులను ఎవరినీ వదులుకోకుండా కేసీఆర్ అమలు చేస్తున్న వ్యూహం ఎంతవరకు ఫలితమిస్తుందోగాని.. ప్రస్తుతానికైతే జంప్ జిలానీలు మాత్రం కిమ్మనలేక ఎక్కడివాల్లక్కడే సర్దుకుంటున్నారట.

ట్రెండింగ్ వార్తలు