Khairatabad Ganesh Nimajjanam
khairatabad maha ganapati immersion : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. భారీగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఉదయం 6గంటల నుంచి మహాగణపతి శోభాయాత్ర వైభవంగా సాగింది. శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై.. గణపతి బప్పా మోరియా.. జైజై గణేశా అనే నినాదాలతో శోభయాత్ర సాగే ప్రాంతాలు మారుమోగిపోయాయి.
Also Read : Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూకు వేలంలో రికార్డు ధర.. ఎవరు దక్కించుకున్నారంటే?
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. నగరంలోని గణనాథులు నిమజ్జనోత్సవానికి ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లే ఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు ఇసుకేస్తే రాలనంత రీతిలో జనంతో కిక్కిరిసిపోయాయి. గణనాథుల నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.