Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూకు వేలంలో రికార్డు ధర.. ఎవరు దక్కించుకున్నారంటే?
వేలంలో బాలాపూర్ లడ్డూ గతకంటే అధికంగా రికార్డు ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి రూ. 30లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్నారు.

Balapur Ganesh Laddu
Balapur Ganesh Laddu Auction : : ఖైరతాబాద్ మహాగణపతి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు. ప్రతీయేటా ఇక్కడ లడ్డూ ధర రికార్డు స్థాయి ధర పలుకుతుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఇక్కడి లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గత ఏడాది బాలాపూర్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికింది. రూ. 27లక్షలకు దయానంద రెడ్డి దక్కించుకున్నారు. అయితే, ఈసారి వేలంలో బాలాపూర్ లడ్డూ గతకంటే అధికంగా రికార్డు ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి రూ. 30లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్నారు. దీంతో గత ఏడాది కంటే మూడు లక్షలు అధనంగా లడ్డూ ధర పలికింది.
బాలాపూర్ లడ్డూ వేలం పాటను 1994 నుంచి నిర్వహిస్తున్నారు. తొలిసారిగా రూ.450తో లడ్డూ వేలంపాట ప్రారంభమైంది.
2001 సంవత్సరం వరకు లడ్డూ వేలంపాట వేలల్లోనే పలికింది.
2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ. 1,05,000కు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. ఆ తరువాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది.
2007లో రఘునందనచారి రూ. 4.15లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2015 సంవత్సరంలో బాలాపూర్ లడ్డూ రూ. 10లక్షలు పలికింది. మధన్ మోహన్ రెడ్డి రూ. 10.32లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2016లో స్కైలాబ్ రెడ్డి రూ.14.65లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2018లో శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2019 సంవత్సరంలో కొలను రాంరెడ్డి రూ.17.60లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాట రద్దు చేశారు.
2021లో రమేశ్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి కలిసి రూ. 18.90లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
2022లో రూ.24.60లక్షలకు రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలికింది.
2023లో దాసరి దయానంద రెడ్డి రూ. 27లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
2024లో కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి రూ. 30లక్షల ఒక వెయ్యికి లడ్డూను దక్కించుకున్నారు.