komati reddy venkat reddy
Assembly Elections 2023:కాంగ్రెస్ అభ్యర్థుల తదుపరి జాబితా కూడా సామాజిక సమీకరణాలు చూసే విడుదల అవుతుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్లు దక్కని వారు ఇతర పదవులు పొందవచ్చని చెప్పారు. వారితో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా మాట్లాడుతుందని తెలిపారు.
ఎమ్మెల్సీతో పాటు ఎంపీ, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఛైర్మన్లు వంటి అనేక పదవులు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు, పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ గ్యారంటీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. పదేళ్లలో అందరికీ పదవులు ఇస్తానని చెప్పి, చాలా మంది నేతలను కేసీఆర్ డొక్కు కార్ ఎక్కించుకున్నారని, అది ముక్కలు అవడం ఖాయమని విమర్శించారు. బీఆర్ఎస్ ముక్కలు అవుతుందని, కవిత, కేటీఆర్, హరీశ్ వల్ల ఒకటి చీలికలు ఏర్పడతాయని ఆరోపించారు.
దేశపతి శ్రీనివాస్ కొటేషన్లు రాసిస్తే వాటినే కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని, ప్రజలకు చేసింది ఏమీలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ధర్నాలు చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఐటీ ఉద్యోగుల మీద పోలీస్ కేసులు పెడుతున్నారని విమర్శించారు.